Begin typing your search above and press return to search.

స్టాలిన్ ను చూస్తూ న‌వ్వినందుకు సెల్వంపై వేటు !

By:  Tupaki Desk   |   8 Feb 2017 5:48 AM GMT
స్టాలిన్ ను చూస్తూ న‌వ్వినందుకు సెల్వంపై వేటు !
X
త‌మిళానాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో తారాస్థాయికి చేరిన కుమ్ములాట‌ల్లో కొత్త కోణం వెలుగుచూసింది. జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద కూర్చొని సెల్వం ధ్యానం చేసిన అనంత‌రం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తొలిసారిగా మీడియాతో శశికళ మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీలో ఎటువంటి సంక్షోభం లేదని, నేతలంతా కలిసే ఉన్నామన్నారు. పన్నీర్‌ సెల్వం వెనుక ప్ర‌తిప‌క్ష‌ డీఎంకే ఉందన్నారు. ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాలే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. సభలో సెల్వం - స్టాలిన్‌ ఎదురెదురుగా కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారని శ‌శిక‌ళ ఆరోపించారు. పన్నీర్‌ సెల్వంపై తాను ఎటువంటి ఒత్తిడి చేయలేదని, రాజీనామా చేయాలని బలవంతం చేయలేదని తెలిపారు. శాసనసభాపక్ష సమావేశంలో త‌న‌ పక్కనే కూర్చుని నాతో బాగా మాట్లాడారని చెప్పారు. పన్నీర్‌ సెల్వం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తామని ఈ సంద‌ర్భంగా శ‌శిక‌ళ ప్ర‌క‌టించారు. అనంత‌రం అన్నాడీఎంకే పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ సెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తొలగించారు. పన్నీర్‌ సెల్వం స్థానంలో డి.శ్రీనివాసన్‌ ను కోశాధికారిగా నియమించారు. కాగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఈ రోజు సమావేశం కానున్నారు. సమావేశానికి శశికళ అధ్యక్షత వహించనుంది.

మ‌రోవైపు శ‌శిక‌ళ కామెంట్లు, అన్నాడీఎంకే కోశాధికారిగా తొలగించిన అనంతరం మీడియాతో పన్వీర్‌ సెల్వం మాట్లాడారు. స్టాలిన్‌ను చూసి నవ్వడంలో ఎటువంటి తప్పు లేదన్నారు. మనిషికి ఉన్న ప్రత్యేక గుణాల్లో నవ్వడం ఒకటని అన్నారు. జ‌యలలిత త‌న‌ను కోశాధికారిగా నియమించారని ఆ పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని పన్నీర్‌ సెల్వం అన్నారు. తాను ఎవరికీ భయపడనని స్ప‌ష్టం చేశారు. ప్రజలంతా నాకు మద్దతు తెలుపుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/