Begin typing your search above and press return to search.

విధేయుడి ధిక్కారం ఎంత ఘాటుగా ఉందంటే..?

By:  Tupaki Desk   |   8 Feb 2017 5:06 AM GMT
విధేయుడి ధిక్కారం ఎంత ఘాటుగా ఉందంటే..?
X
‘‘సిట్ అంట్ సిట్.. స్టాండ్ అంటే స్టాండ్’’ పన్నీరు సెల్వం గురించి ఒక్క మాటలో చెప్పేయమంటే ఇంతకుమించి చెప్పేదేమీ ఉండదు. డిజిటల్ యుగంలోనూ పన్నీర్ లాంటి విధేయ రాజకీయ నేత మీద సోషల్ మీడియాలో భారీగానే జోకులు పేలుతుంటాయి. రకరకాల పోలికలు పెట్టి.. ఆయన విధేయత మీద వ్యంగ్యాస్త్రాలు విసిరే వారికి కొదవ లేదు. మరి.. అలాంటి పన్నీర్ ఇప్పుడు మొత్తంగా మారిపోయారు. నిన్న రాత్రి వరకూ పన్నీర్ లోని విధేయ యాంగిల్ చూసిన వారు.. ఇప్పుడాయనలోని సరికొత్త కోణాన్ని చూపిస్తున్నారు.

అమ్మ ఆత్మ తనను మాట్లాడమందంటూ గళం విప్పిన ఆయన..కడుపులో దాచుకున్నదంతా ఒక్కొక్కటిగా చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడాయన మాటలు సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాయి. మెరీనా బీచ్ దగ్గరి అమ్మ సమాధి దగ్గర మౌనదీక్ష చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన చిన్నమ్మపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆయన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున నేతలు చేరుకోవటం.. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చిన్నమ్మ మీద ధిక్కార స్వరం వినిపించినంతనే.. అత్యవసరంగా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి పన్నీర్ ను తొలగించిన చిన్నమ్మ నిర్ణయంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘‘ఈ పదవి అమ్మ ప్రసాదించింది. నన్ను తీసే హక్కు ఎవ్వరికీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడను. కొద్ది గంటల్లో నేనేంటో చూపిస్తా. వెయిట్ చేసి చూడండి’’ అంటూ గర్జించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తనపై ద్రోహి అన్న ముద్ర వేసిన చిన్నమ్మ శశికళపై తీవ్రస్థాయిలో మండిపడ్డ పన్నీర్ సెల్వం.. ప్రతిపక్ష నేత ఎదురుపడినప్పుడు నవ్వటం కూడా నేరమేనా? నాకు తెలిసి అలా నవ్వటం నేరమేమీ కాదన్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో పన్నీర్ క్యాంపులోకి 62 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న బలాన్ని ప్రదర్శించేందుకు ఢిల్లీకి వెళ్లే అంశం మీద పన్నీర్ దృష్టి పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. తనకున్న ఎమ్మెల్యేలతో ఢిల్లీలోని రాష్ట్రపతిని కలిసి.. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాలని పన్నీర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా ఇప్పటివరకూ సాఫ్ట్ గా కనిపించిన పన్నీర్ సెల్వం ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న వైనం తమిళ రాజకీయాల్ని మరింత హాట్ హాట్ గా మారుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/