Begin typing your search above and press return to search.

రియల్ గా ఇప్పుడు ఎవరి బలం ఎంత?

By:  Tupaki Desk   |   8 Feb 2017 4:15 AM GMT
రియల్ గా ఇప్పుడు ఎవరి బలం ఎంత?
X
తమిళనాడులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో అంకెల ప్రాధాన్యం ఒక్కసారిగా వచ్చేసింది. మొన్నటి వరకూ అమ్మ మాట.. నిన్నటివరకూ చిన్నమ్మ మాటకు తిరుగులేదన్న మాటకు తగ్గట్లే.. కుక్కిన పేనుల్లా ఉన్న అన్నాడీఎంకే నేతల వైఖరికి భిన్నంగా తాజాగా పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. అమ్మ చేత రెండుసార్లు సీఎంగా ఎంపికైన పన్నీర్ సెల్వం సైతం అత్యంత విధేయుడిగా వ్యవహరించారే కానీ.. నోరు విప్పింది లేదు. అమ్మసమాధి దగ్గర ధ్యానం చేసిన తర్వాత బరస్ట్ అయిన ఆయన కారణంగా ఇప్పుడు అంకెలకు ప్రాధాన్యం ఒక్కసారిగా వచ్చేసింది.

చిన్నమ్మ ఎంతలా తనను అవమానించినప్పటికీ.. ముఖంలో ఎలాంటి భావాన్నిప్రదర్శించని పన్నీర్.. మంగళవారం రాత్రి అమ్మ సమాధి దగ్గర కూర్చొని.. ధ్యానంచేసిన తర్వాత కన్నీటితోనిండిన కళ్లను తుడుచుకోవటం.. అమ్మ ఆత్మ ఆవేదనతో తనను ఆదేశించిందంటూ.. చిన్నమ్మపై ఎగురవేసిన తిరుగుబాటు బావుటాతో.. చిన్నమ్మ బలం ఎంత? పన్నీరు వెంట ఉన్నది ఎంతమంది?విపక్షాల మాటేమిటి?లాంటి సందేహాలువచ్చేసే పరిస్థితి.

అన్నాడీఎంకేలో జరుగుతున్న అంతర్గత విభేదాల్ని తనకు అనువుగామార్చుకోవటానికి డీఎంకే అస్సలు ప్రయత్నించట్లేదు. ఒకవేళ అలా చేస్తే తమిళప్రజలు తమను క్షమించరన్న విషయం తెలిసిన వారు.. అందుకు భిన్నంగా..జనాల మైండ్ సెట్ కు తగ్గట్లు.. చిన్నమ్మకు వ్యతిరేకంగా.. ప్రజాభిమానం ఉన్నపన్నీరుకు అనుకూలంగా పావులు కదపుతుండటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికిప్పుడు తమిళనాడులో పార్టీల వారీగా ఉన్న బలాబలాలు.. రియల్ గాఉన్న బలాన్ని చూస్తే..

మొత్తం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో అమ్మ మరణం తర్వాత.. తమిళనాడు అసెంబ్లీలో 233 మంది సభ్యులున్నారు. పన్నీరుసెల్వంతో కలిపి అన్నాడీఎంకేకు 134 మంది..డీఎంకేకు 89 మంది.. కాంగ్రెస్ కు ఎనిమిది మంది.. ఇతరులు రెండు స్థానాల్లో ఉన్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బలాబలాల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాలి. అధికార అన్నాడీఎంకేలో చిన్నమ్మ వర్గం.. పన్నీర్ వర్గం మాత్రమే తెర మీద కనిపిస్తోంది. పలువురి వాదన ప్రకారం అమ్మమేనకోడలు దీపకు కొద్దిమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినా.. దానికిసంబంధించిన వివరాలు బయటకు రావటం లేదు.

దీప విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఇప్పటికి అందుతున్నసమాచారం ప్రకారం పన్నీరుకు 50 మంది కంటే ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న మాట వినిపిస్తోంది. సోమవారం నాటికి ఈ సంఖ్య 35గా మాత్రమే ఉంది. పన్నీర్ రాజీనామా.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. చిన్నమ్మను సీఎం కాకుండా గవర్నర్ తీసుకున్న నిర్ణయం.. వివిధ వర్గాల వారు శశికళ మీద బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేయటం.. సోషల్ మీడియాలో చిన్నమ్మపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న తీరు లాంటి వాటి తర్వాత పన్నీరు సెల్వం బలం మరింత పెరిగిందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. పన్నీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే.. ఆయనకుడీఎంకే మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలంచేకూరుస్తూ.. పన్నీర్ తిరుగుబావుటా నేపథ్యంలో పార్టీ నేతలతో స్టాలిన్ అత్యవసర భేటీని నిర్వహించటం గమనార్హం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన పక్షంలో.. ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే సాయం అందిస్తుందన్న మాట వినిపిస్తోంది. ప్రజలు ఆగ్రహంగా ఉన్న చిన్నమ్మను సీఎం కాకుండా అడ్డుకోవటంతోపాటు.. ఎంతోకొంత ప్రజా మద్దతు ఉన్న పన్నీరుకు అవకాశం కల్పించారన్న సానుకూలత తమకు లభించే అవకాశం ఉంటుందన్న భావన డీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే అధికారం కోసం తపించినట్లుగా కనిపించకుండా.. స్టాలిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు. వీటన్నింటికి మించి.. కేంద్రంలోని మోడీ సర్కారు సైతం పన్నీరుకు మద్దతుగా ఉండటం ఆయనకు లభిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/