Begin typing your search above and press return to search.

అతడి దగ్గర నుంచి రూ.12కోట్లు తీసుకున్న నూతన్ నాయుడు

By:  Tupaki Desk   |   12 Sept 2020 10:00 AM IST
అతడి దగ్గర నుంచి రూ.12కోట్లు తీసుకున్న నూతన్ నాయుడు
X
కొన్నిసార్లు కాలం కలిసి వచ్చి పేరు ప్రఖ్యాతలు ఇట్టే వచ్చి చేరతాయి. వచ్చినంత తేలిగా వదిలి వెళ్లిపోతాయన్న సత్యాన్ని గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకు భిన్నంగా ఆలోచిస్తేనే అసలు ఇబ్బంది అంతా. బిగ్ బాస్ షోతో కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకోవటమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారారు నూతన్ నాయుడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ఇంట్లో పని చేసే వ్యక్తి చోరీ చేశాడన్న పేరుతో శారీరకంగా.. మానసికంగా హింసించటమే కాదు.. శిరోముండనం చేయించిన ఉదంతం పెను సంచలనంగా మారింది. ఈ ఎపిసోడ్ లో అరెస్టు అయి.. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న నూతన్ నాయుడిపై కొత్త కంప్లైంట్ పోలీసులకు చేరింది. ఇద్దరికి బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ్బులు లాగేసినట్లుగా ఆరోపిస్తున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కీలకమైన స్థానాన్ని అప్పజెబుతానని నమ్మబలికి తన నుంచి రూ.12 కోట్లు తీసుకున్నట్లుగా కంప్లైంట్ చేశారు తెలంగాణలోని చేవెళ్ల ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి. తాజాగా ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమేరాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీకాంత్ రెడ్డికి నూతన్ నాయుడితో పరిచయం ఉంది.

ఈ క్రమంలో ఎస్ బీఐలో దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు ఇప్పిస్తానని చెప్పి తన నుంచి రూ.12కోట్లు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇది జరిగి రెండేళ్లు అవుతున్నా.. ఎలాంటి ఉద్యోగం ఇప్పించలేదన్నారు. దీంతో.. మోసపోయినట్లుగా భావించి తాను కంప్లైంట్ చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు.

అయితే.. ఒక ఉద్యోగం కోసం నూతన్ నాయుడికి రూ.12 కోట్లు ఇచ్చానని చెబుతున్నా శ్రీకాంత్ రెడ్డికి అంత స్థాయి ఉందా? లేదా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే రీతిలో తనకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.5లక్షలు లాగేసినట్లుగా ఆరోపిస్తున్నారు విశాఖ జిల్లాకు చెందిన నూకరాజు. మరి.. ఈ రెండు కంప్లైంట్లు నూతన్ నాయుడికి మరెన్ని చిక్కులు తీసుకొస్తాయన్న సందేహం వ్యక్తమవుతోంది.