Begin typing your search above and press return to search.

తెలంగాణ కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలట

By:  Tupaki Desk   |   10 Oct 2016 4:52 PM GMT
తెలంగాణ కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలట
X
ముద్దు వచ్చినప్పుడే చంకనెక్కాలి. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు ఏపీ టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు. రాజకీయ ప్రత్యర్థులపై నిర్దయగా విరుచుకుపడే ఆయన.. తాజాగా తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్ కాస్త చిత్రంగా ఉండటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందరకాళ్ల బంధాలు వేసిన తీరు ఆకట్టుకునేలా ఉందనటంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి తిట్లు పడని సీమాంధ్ర ప్రాంతానికి చెందిననేతల్లో ఫస్ట్ ప్లేస్ ఎన్టీవోడికే చెల్లుతుంది. తనకు గౌరవం ఉన్నప్పటికీ ఏపీకి చెందిన నేతలైతే వారి ప్రస్తావన తీసుకు రావటానికి సుతారం ఇష్టపడని కేసీఆర్.. ఎన్టీఆర్ గురించి మాత్రం కీలక సందర్భాల్లో ఆయనప్రస్తావన రేఖా మాత్రంగా తీసుకొచ్చి పొగిడేయటం కనిపిస్తుంది.

అలాంటి కేసీఆర్ నిన్న వరంగల్ లో భద్రకాళి అమ్మ వారికి మొక్కలు చెల్లించిన తర్వాత మీడియాతో మాట్లాడే సందర్భంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ను పొగిడేయటాన్ని మర్చిపోలేం. మిగిలిన విషయాల్ని పట్టించుకున్నారో లేదో కానీ.. ఏపీ టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ సరిగ్గా ఇదే పాయింట్ ను పట్టుకొని తాజాగా ఆయన ఒక ఆసక్తికరమైన డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.

పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన గాలి ముద్దుకృష్ణమ.. గతంలో ప్రజలకు మెరుగైన పాలన కోసం 1987లో ఎన్టీఆర్ 280కి పైగా ఉన్న పంచాయితీ సమితులను 1100 మండలాలుగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేయటంతో పాటు.. 25 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే ఒక మండలంగా ఏర్పాటు చేశారన్నారు. మండలాల ఏర్పాటుపై ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి గాలి ముద్దుకృష్ణమ ఒకకీలక వ్యాఖ్య చేశారు. పాలనా సౌలభ్యం కోసంఎన్టీఆర్ ఏ తీరులో అయితే మండలాలు ఏర్పాటు చేశారో.. అదే స్ఫూర్తితో కేసీఆర్ జిల్లాల్ని ఏర్పాటు చేస్తున్నారని.. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపిన ఎన్టీఆర్ పేరును తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల్లో ఒకదానికి పెట్టాలని కోరారు.

‘‘ఎన్టీఆర్ పేరును కేసీఆర్ తన కుమారుడికి పెట్టుకున్నారు సంతోషం. కొంతమంది మహానుభావుల పేర్లను జిల్లాలకు పెడతామని కేసీఆరే చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి.. పేదల సంక్షేమానికి కృషి చేసిన ఎన్టీఆర్ పేరును తెలంగాణలో ఏర్పాటు చేసే జిల్లాలకు పెట్టాలి’’ అని కోరారు. మరి.. ఈ ఆసక్తికర డిమాండ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.