Begin typing your search above and press return to search.

ఇక పై ఫ్రీ గా ఇసుక ... జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   13 Nov 2020 4:20 PM IST
ఇక పై ఫ్రీ గా ఇసుక ... జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
X
ఇకపై ప్రజలు తమకు నచ్చిన ఇసుక రీచ్ ‌కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడికక్కడే డబ్బు చెల్లించి, కావాల్సిన చోటుకు ఇసుకను తీసుకెళ్లవచ్చు. నెట్‌ పని చేయడం లేదనే తిప్పలు ఉండవు. బుక్‌ చేసుకోవడం కోసం యాప్‌ పని చేయడం లేదంటూ నెట్‌ సెంటర్ల వద్దకు పరుగులు తీయాల్సిన శ్రమ అంతకంటే . ఆన్ ‌లైన్‌ మోసాలకు ఆస్కారం ఉండదు. సిఫార్సుల ఊసుండదు. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం ఇసుక పాలసీ 2019 ని మరింత మెరుగు పరిచింది. ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది జీఓ జారీ చేశారు.

తాజాగా సవరించిన ఇసుక పాలసీలో ముఖ్యాంశాలని ఒకసారి చూస్తే ... ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయం బాధ్యతలను నామినేషన్‌ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది. నిర్ణయించిన మొత్తాన్ని ఆయా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాలి. సీనరేజి, ఇతర పన్నులు దీనికి అదనం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస టెండరు ధర ఖరారు చేసి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థలను టెక్నికల్, కమర్షియల్‌ బిడ్ల ద్వారా ఎంపిక చేస్తుంది.

మొత్తం రీచ్‌లు మూడు ప్యాకేజీలుగా వర్గీకరణ చేయబోతున్నారు. అందులో భాగంగా ,, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలను మొదటి ప్యాకేజీ కింద.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు రెండవ ప్యాకేజీగా.. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాలను మూడో ప్యాకేజి కింద చేరుస్తారు. 1–3 ఆర్డర్‌ స్ట్రీమ్స్‌తోపాటు ఆపై స్థాయి స్ట్రీమ్స్‌ ను నిర్వహణ సంస్థలకే అప్పగించి ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయాలు సాగించేందుకు వీలుగా ఏపీ వాల్టా, ఏపీ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌ను సవరిస్తారు. ఆఫ్‌లైన్‌ విధానంలోనే డబ్బు చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఆన్‌లైన్‌ విధానం ఉండదు. స్టాక్‌ యార్డులు/ రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి వినియోగదారులే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆయా సంస్థలు ప్రతి స్టాక్‌ యార్డు/ రీచ్‌లలో 20 వాహనాలను అందుబాటులో ఉంచాలి. ఈ సంస్ధలు నిర్ణీత పూచీకత్తు మొత్తం చెల్లించాలి.

ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఎడ్లబండ్లపై ఉచితంగా తీసుకెళ్లవచ్చు. రీచ్‌లకు సమీపంలోని గ్రామాల వారికి, బలహీన వర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు, సహాయ పునరావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్ల జారీ ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తారు. అన్ని దశల్లో పారదర్శకత ఉంటుంది. అక్రమ తవ్వకాలు, నిల్వ, రవాణాను నియంత్రించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు దాడులు చేసి, కేసులు నమోదు చేసే అధికారముంటుంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ పాలసీలో సవరణలు తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందించడం, వారే స్వయంగా ఇసుక నాణ్యతను పరిశీలించి తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న లక్ష్యంగా పాలసీలో సవరణలు చేసినట్లు తెలిపారు.