Begin typing your search above and press return to search.

ఇప్పుడు సుప్రీం న్యాయమూర్తి.. అప్పట్లో లారీలో తప్పించుకున్నారట

By:  Tupaki Desk   |   24 Jan 2021 1:10 PM IST
ఇప్పుడు సుప్రీం న్యాయమూర్తి.. అప్పట్లో లారీలో తప్పించుకున్నారట
X
ఇప్పుడు దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న పలువురు.. 1975 ఎమర్జెన్సీ వేళలో అష్టకష్టాలు పడటమే కాదు.. ప్రాణం దక్కించుకోవటానికి ఊహించలేని పనులు చేశారు. ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడు ఎమర్జెన్సీ బాధితుడు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి.. తెలుగువాడైన జస్టిస్ ఎన్వీ రమణ.. ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను పద్దెనిమిదేళ్ల కుర్రాడినని చెబుతూ.. గతంలోకి వెళ్లారు. ఇప్పటివరకు బయటకు రాని విషయాల్ని వెల్లడించారు.

దీనంతటికి ప్రముఖ న్యాయవాది.. కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ.. ప్రొఫెసర్ ఖగేశ్ గౌతమ్ రచించిన ‘ద లా ఆప్ ఎమర్జెన్సీ - కంపారేటివ్ కామన్ లా పరిస్పెక్టివ్స్’ అన్న పుస్తక ఆవిష్కరణ సభ వేదికగా మారింది. ఎమర్జెన్సీ వేళలో తాను లారీలో తప్పించుకున్న విషయాన్ని వెల్లడించారు. జస్టిన్ ఎన్వీ రమణ ఏం చెప్పారన్నది చూస్తే.. ‘‘1975 ఎమర్జెన్సీ వేళలో నేను పద్దెనిమిదేళ్ల కుర్రాడ్ని. ఉత్సాహంతో ఉరకలేస్తున్నయువకుడ్ని. అప్పటి నా ఆత్మస్థైర్యాన్ని తలుచుకుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పట్లో మా స్వగ్రామంలో పౌరహక్కుల పరిరక్షణపై ఏర్పాటైన సభకు నేను అధ్యక్షత వహించాల్సి ఉంది. ఆ మీటింగ్ కు వెళుతుంటే మా నాన్న రెండు జతలు బట్టలు వెంట తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. సమావేశం జరిగే సమయంలో నన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన సరిగానే ఊహించారు’ అని నాటి గురుతుల్ని గుర్తు చేసుకున్నారు.

తన స్నేహితుడు ఊరి పొలిమేరల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించనుందని చెప్పాడని.. దీంతో ఇద్దరం లారీ ఎక్కి తమ పిన్ని ఇంటికి చేరుకున్నట్లు చెప్పారు. అప్పట్లో తన దగ్గర కేవలం పది రూపాయిలు మాత్రమే ఉన్నాయన్నారు. దేశంలో ఎమర్జెన్సీ కొన్ని తరాలపై సుదీర్ఘ కాలం ప్రభావం చూపిందన్న జస్టిస్ రమణ.. అత్యయిక పరిస్థితి తన దృక్పథంలో మార్పులు తెచ్చిందన్నారు. దాని కారణంగా ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవటంతో ఎంతో మానసిక వేదనను అనుభవించానని చెప్పారు.

‘ఒక మానవ విషాదం.. ఆకలి.. బాధ.. వేదన అంటే ఏమిటో ఆ కాలం నాకు తెలిసేలా చేసింది. ఎమర్జెన్సీ దుర్మార్గాల గురించి అర్థం చేసుకునే అవకాశం లభించింది’ అని పేర్కొన్నారు. మొత్తానికి ఎమర్జెన్సీనాటి పరిస్థితులు ఈ తరానికి అర్థమయ్యేలా.. తన జీవితంలో జరిగిన ఉదంతాల్ని పంచుకున్నారని చెప్పక తప్పదు.