Begin typing your search above and press return to search.

వర్క్‌ ఫ్రం హోమ్‌ కి స్వస్తి .. ఇక ఆఫీస్ కి రావాల్సిందే !

By:  Tupaki Desk   |   17 Sept 2021 2:00 PM IST
వర్క్‌ ఫ్రం హోమ్‌ కి స్వస్తి .. ఇక ఆఫీస్ కి రావాల్సిందే !
X
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత వర్క్‌ ఫ్రం హోమ్‌ అనేది కామన్ అయిపోయింది. అయితే ,గత ఏడాదిన్నరగా ఈ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అతి త్వరలో కార్యాలయాల బాట పట్టనున్నారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సైతం విజయవంతం కావడంతో పలు సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను క్రమంగా కార్యాలయాలకు రప్పించేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ఈమేరకు ఐటీ కంపెనీలు సొంతంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి చాలా ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోంను అమల్లోకి తెచ్చాయి. మొదటిదశ తీవ్రత తగ్గిన తర్వాత వివిధ విభాగాలకు చెందిన వారిని కార్యాలయాల్లో ప్రత్యక్ష విధులకు అనుమతించినప్పటికీ... ఐటీ ఇంజనీర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చాయి. తాజాగా ప్రభుత్వం సైతం వర్క్‌ ఎట్‌ ఆఫీస్‌ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసుకోవచ్చని చెప్పడం,ఐటీ కంపెనీలు పూర్తిస్థాయిలో తెరుచుకుంటే వాటిపై ఆధారపడ్డ ఇతర రంగాలు సైతం పురోగతిలోకి వస్తాయనడంతో ఈ దిశగా చర్యలు వేగవంతం అయ్యాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అంతర్జాతీయ కంపెనీలు మొదలు., చిన్నపాటి ఐటీ సంస్థలు కలిపి రాష్ట్రంలో దాదాపు 1,500 ఉన్నాయి. వీటిలో 6.5 లక్షల మంది సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన 4.5 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు హాజరైతే, అనుబంధంగా ఉన్న రవాణా రంగం, రిటైల్‌ మార్కెట్, బేకరీ, హోటల్స్‌ తోపాటు అద్దె ఇళ్లకు కూడా డిమాండ్‌ పెరుగుతుంది. వీటిని నమ్ముకున్న వారికి ఉపాధి లభిస్తుంది.

ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు ప్రాధాన్యతాక్రమంలో వ్యాక్సిన్‌ అందించామని, ఇప్పటికీ వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నామని, మెజార్టీ ఉద్యోగులు రెండు డోసులు తీసుకున్నారని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. పరిస్థితులు చక్కబడటంతో ప్రతి ఉద్యోగి కార్యాలయానికి హాజరుకావొచ్చనే భావన ఐటీ సంస్థల్లో, ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఉద్యోగులను తిరిగి ప్రత్యక్ష విధులకు రప్పించేందుకు ఇప్పటికే పలు కంపెనీలు వ్యూహాత్మక కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. వచ్చే నెల రెండో వారం నుంచి వర్క్‌ ఎట్‌ ఆఫీస్‌ ప్రక్రియను విడతల వారీగా అమలు చేయనున్నాయి.

టీం లీడర్, ఆపైస్థాయి ఉద్యోగులను ముందుగా రప్పించి తర్వాత కేటగిరీల వారీగా సిబ్బందిని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగులకు ఈ–మెయిల్, వాట్సాప్, ఎస్‌ ఎంఎస్‌ ల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు సిబ్బందిని మూడు నుంచి నాలుగు టీమ్‌లుగా విభజించి వారికి ఆఫీసుకు వచ్చే తేదీలను సైతం ఖరారు చేస్తున్నాయి. దసరా తర్వాత నుంచి ప్రత్యక్ష విధులు ప్రారంభం కానుండగా, డిసెంబర్‌ ఆఖరుకల్లా అన్ని స్థాయిల ఉద్యోగులు కార్యాలయాలకు హాజరుకానున్నారు. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు మాత్రం డిసెంబర్‌ వరకు వర్క్‌ ఫ్రం హోం కొనసాగించి జనవరి నుంచి ఆఫీసులో విధులకు హాజరయ్యేలా ప్రణాళికలు రచించాయి.

కొన్ని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు మినహాయిస్తే ఇతర కంపెనీలన్నీ ఉద్యోగులను వర్క్‌ ఎట్‌ ఆఫీస్‌ విధానంలో పనిచేయించేందుకు సిద్ధమవుతున్నాయి. వర్క్‌ ఫ్రం హోం ఉండటంతో చాలామంది సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అద్దె ఇళ్లలో ఉన్న వాళ్లు ఖాళీ చేసి పోయారు. వాళ్లంతా తిరిగొచ్చేందుకు కొంత సమయం పడుతుంది. అందరూ ఆఫీసులో విధులు నిర్వహించవచ్చన్న ప్రభుత్వ ప్రకటనలతో ఉద్యోగుల్లో మనోధైర్యం పెరిగింది.