Begin typing your search above and press return to search.

కొండను తవ్వి ఎలుకను పట్టటమంటే ఇదే.. దీనికే ఇంత రచ్చనా?

By:  Tupaki Desk   |   9 Jan 2022 5:30 AM GMT
కొండను తవ్వి ఎలుకను పట్టటమంటే ఇదే.. దీనికే ఇంత రచ్చనా?
X
ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సదరు క్రీడాకారుడి దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉదంతంగా టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ ను ఆస్ట్రేలియాలోకి ఎంట్రీ ఇవ్వకపోవటం తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆడేందుకు ఆ దేశానికి వెళ్లిన ఆయన.. నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంది. అయితే.. ఆయన ఇప్పటివరకు టీకా వేసుకోని కారణాన్ని చూపించి..ఆయనకు మంజూరు చేసిన వీసాను రద్దు చేశారు.

విమానాశ్రయంలోనే నిలిపేసి.. అనంతరం మెల్ బోర్న్ లోని పార్క్ హోటల్ కు తరలించారు. అయితే.. ఇదంతా జరగటానికి కొన్ని గంటల పాటు విమానాశ్రయంలోనే అతన్ని నిలిపివేశారు.

ఈ వ్యవహారంపై జొకోవిచ్ ప్రతినిధ్యం వహించే సెర్చియా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ దేశం మొత్తం జొకోవిచ్ కు అండగా నిలుస్తుందని ఆ దేశాధ్యక్షుడు సైతం ప్రకటించారు. ఇంతకూ ఆస్ట్రేలియా ఓపెన్ డిఫెండిగ్ చాంపియన్ ఎందుకు వ్యాక్సిన్ వేసుకోలేదు? అన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. దీంతో.. ఈ సస్పెన్స్ రెండు.. మూడురోజలుగా సాగుతోంది.

దీనికి తెర దించుతూ జొకోవిచ్ తరఫు న్యాయవాది తాజాగా ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణలో వివరాల్ని వెల్లడించారు. ఫెడరల్ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో.. ఈ 34 ఏళ్ల సెర్బియన్ ఆటగాడు.. గత నెలలోనే కరోనా బారిన పడ్డారని.. అందుకే వ్యాక్సిన్ కు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత నెల16న జొకోవిచ్ కు కరోనా సోకినట్లుగా తెలిపారు. గడిచిన మూడు రోజులుగా జోకోవిచ్ కు ఎలాంటి శ్వాస సమస్యలు ఎదురుకాలేదని తెలిపారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు.

ఈ వివాదం ఇలాసాగుతుంటే.. మరోవైపు ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ ఆడేందుకు వీలుగా టోర్నీ నిర్వాహకులు ప్రత్యేక అనుమతిని మంజూరు చేశారు. ఇక.. జొకోవిచ్ ట్రావెల్ డిక్లరేషన్ పరిశీలించిన ఆస్ట్రేలియా హోం మంత్రిత్వ శాఖ.. అతడు దేశంలోకి అడుగు పెట్టాక క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్న విషయానికి సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు అందించారు.

దీంతో.. జొకోవిచ్ ఎందుకు వ్యాక్సిన్ వేసుకోలేదన్న దానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మరి.. జొకోవిచ్ లాయర్లు వినిపించిన వాదనకు ఫెడరల్ ఏలా రియాక్టు అవుతుంది? దాని నిర్ణయం ఏమిటన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ.. కోర్టులో జొకోవిచ్ న్యాయవాదులు ఓడితే మాత్రం.. ఈ సెర్బియన్ ఆటగాడికి మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకుండా నిషేధాన్ని విధించే వీలుంది.