Begin typing your search above and press return to search.

ఏర్పాట్లు లేకుండానే నోటిఫికేషనా ?

By:  Tupaki Desk   |   24 Jan 2021 3:45 PM IST
ఏర్పాట్లు లేకుండానే నోటిఫికేషనా ?
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారం ఇపుడు చర్చనీయాంశమవుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలని అనుకున్న నిమ్మగడ్డ ప్రభుత్వంతో సానుకూలంగా ఉండాలి. అలాకాకుండా నేను చెప్పిందే ప్రభుత్వం వినాలనే ధోరణిలో ఉండటంతోనే వివాదం తారాస్ధాయికి చేరుకునేసింది. తాను చేయదలచుకున్న పనులను ప్రభుత్వంతో మాట్లాడుకుని చేయాలని అనుకోకుండా ప్రతిదానికి కోర్టుకెళ్ళి ఆదేశాలు ఇఫ్పిస్తున్నారు. దాంతో ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది.

రాజ్యాంగబద్దమైన అధికారాలని, విలువలని, బాధ్యతలని నిమ్మగడ్డ చాలానే చెప్పారు మీడియా సమావేశంలో. ఇవన్నీ ఒకేనేకానీ అసలు ఎన్నికలకు ఏర్పాట్లే చేయకుండా ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలా ఇస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్నికల ఏర్పాట్లంటే ముందు బీఫారాలు ప్రింట్ చేయాలి. వాటిని అభ్యర్ధులకు అందించాలి. తర్వాత వాళ్ళనుండి బీఫారాలు తీసుకుని అన్నీ సక్రమంగా ఉందో లేదో చెక్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళకు ఎన్నికల గుర్తలు కేటాయించాలి.

ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేస్తున్నారు, వాళ్ళ గుర్తులేవీ అన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ ముద్రణకు రెడీ అవ్వాలి. ఆ తర్వాత పోలింగ్ కు ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ తర్వాత పోలింగ్ సందర్భంగా పోలింగ్ బాక్సులు రెడీ చేసుకోవాలి. అక్కడే ఓటర్లజాబితాను కూడా సిద్ధంగా ఉంచాలి. దీనికన్నా ముందు పోలింగ్ కేంద్రాలు రెడీ చేసి పోలింగ్ సజావుగా సాగటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.

పై ప్రక్రియంతా జరగాలంటే అందుకు వేలాదిమంది సిబ్బంది 24 గంటలూ పనిచేయాలి. అప్పుడు కానీ ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లయినట్లు కాదు. ఇటువంటి ఏర్పాట్లన్నీ ఏవీ జరగకుండానే నిమ్మగడ్డ తనంతట తానుగా నోటిఫికేషన్ ఇఛ్చేసి పోలింగ్ కు రెడీ అనేశారు. అయితే పై ప్రక్రియలో పాల్గొనేందుకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఎవరు ముందుకు రావటం లేదు. పైగా తమపై ఎటువంటి చర్యలు తీసుకున్నా తాము ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించేశారు. మరి ఈ పరిస్ధితుల్లో నిమ్మగడ్డ ఏమి చేయబోతున్నారు ? అన్నదే సస్పెన్సుగా మారింది.