Begin typing your search above and press return to search.

‘రద్దు’ లాభం లెక్క చెప్పుకొచ్చారు

By:  Tupaki Desk   |   26 Jan 2017 4:47 AM GMT
‘రద్దు’ లాభం లెక్క చెప్పుకొచ్చారు
X
పెద్ద నోట్ల రద్దుతో భారీ లాభాన్నే ఆశించింది మోడీ సర్కారు. లక్షల కోట్ల రూపాయిల నల్లధనం తెల్లధనంగా మార్చలేకపోవటం ఖాయమని.. దీంతో.. చలామణీలో ఉన్న నల్లధనం ప్రభుత్వానికి భారీ ప్రయోజనాన్ని మిగులుస్తుందన్న ఆశతో అంత భారీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతారు. మోడీ సర్కారు అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి అన్న వార్తలు చాలానే వచ్చాయి. దీనికి తగ్గట్లే.. మా హుషారుగా ప్రకటించిన రద్దు నిర్ణయంతో ప్రభుత్వానికి జరిగిన లాభం సంగతి తర్వాత.. అసలు ఎంత మొత్తం బ్యాంకుల వద్దకు వచ్చిందన్న లెక్కను ఇప్పటివరకూ చెప్పకపోవటాన్ని మర్చిపోకూడదు.

ప్రభుత్వ లెక్కలు తప్పాయని.. ఊహించని విధంగా బ్లాక్ మనీ కూడా వైట్ రూపంలో బ్యాంకుల వద్దకు చేరిందని.. ఈ పరిణామాన్ని ప్రభుత్వం అస్సలు అంచనా వేయలేదన్న వాదన ఉంది. ఇలాంటి వేళ.. మోతీలాల్ ఓస్వాల్ అనే దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఒకటి.. ‘రద్దు’తో మోడీ సర్కారుకు జరిగిన ప్రయోజనాన్ని లెక్కించే ప్రయత్నం చేసింది.

ఈ సంస్థ అంచనా ప్రకారం.. వ్యవస్థలో చలామణీలో ఉన్న మొత్తంలో.. బ్యాంకులకు తిరిగి మొత్తం చాలా స్వల్పమేనన్న అంచనాను ప్రకటించింది. పెద్దనోట్లను రద్దు చేసే నాటికి(నవంబరు 8) వ్యవస్థలో చెలామణిలో ఉన్న రూ.వెయ్యి.. రూ.500 నోట్ల విలువ రూ.15.55 లక్షల కోట్లుగా నిర్థారించారు. ఇందులో 20 శాతం తిరిగి వచ్చే అవకాశం లేదని అంచనా కట్టారు. కానీ.. వాస్తవం అందుకు భిన్నంగా ఉందని.. రద్దు అయిన నోట్లలో కేవలం 3.5 శాతం నోట్లు మాత్రమే బ్యాంకులకు తిరిగి రాలేదని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. బ్యాంకులకు తిరిగి రాని మొత్తం కేవలం రూ.40వేల కోట్లు మాత్రమేనని పేర్కొంది.

డిసెంబరు 10 తర్వాత ఎంత నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యిందన్న విషయాన్ని ఆర్ బీఐ వెల్లడించలేదని.. అయితే డిసెంబరు 19 వరకు లభించిన గణాంకాల్ని ఆధారంగా తీసుకొని ఈ అంచనాల్ని తయారు చేసింది. దీని ప్రకారం బ్యాంకులకు తిరిగి రాని మొత్తం రూ.40వేల కోట్లు అయితే.. పన్ను చెల్లింపులు జరపని నగదును ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద వెల్లడించే మొత్తంతో ప్రభుత్వానికి రూ.32,800 కోట్లు వచ్చే అవకాశం ఉందని.. మొత్తంగా రూ.72,800 కోట్లు ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అంచనాతో అర్థమయ్యేదేమంటే.. రద్దుతో కనీసం రూ.2లక్షల కోట్లకు పైనే ప్రయోజనాన్ని ఆశించిన మోడీ సర్కారు అంచనాకు.. వాస్తవానికి మధ్య అంతరం చాలా ఎక్కువే ఉందని. ఈ నేపథ్యంలో.. బడ్జెట్ లో భారీ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రకటించే అవకాశాలు పెద్దగా ఉండవన్న భావన వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/