Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో నోటాకు ఏకంగా ఐదు లక్షల ఓట్లు!

By:  Tupaki Desk   |   9 Dec 2022 9:30 AM GMT
ఆ రాష్ట్రంలో నోటాకు ఏకంగా ఐదు లక్షల ఓట్లు!
X
గుజరాత్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్‌ అసెంబ్లీలో ఏకంగా 156 స్థానాలు దక్కించుకుని బీజేపీ రికార్డులు బ్రేక్‌ చేసింది. బీజేపీకి ఏకంగా 52.5 శాతం ఓట్లు వచ్చాయి.

అధికారం కోసం గట్టిగా ప్రయత్నించిన కాంగ్రెస్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు గుజరాత్‌ అసెంబ్లీ ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. కాంగ్రెస్‌ పార్టీ గతంలో 77 స్థానాలతో ఉండగా ఈసారి 17 స్థానాలకే పరిమితమై పోయింది. కాంగ్రెస్‌కు 27.3 శాతం ఓట్లు వచ్చాయి. అలాగే ఆమ్‌ ఆద్మీ పార్టీ 12.9 శాతం ఓట్లతో 5 సీట్లను గెలుచుకుంది.

ఇక నోటాకు ఏకంగా 5 లక్షల ఓట్లు రావడం అందరినీ నివ్వెరపరిచింది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎన్‌సీపీ, సమాజ్‌ వాదీ పార్టీ, ఎంఐఎం ఇలా పలు పార్టీలున్నప్పటికీ ఏ పార్టీకి ఓటు వేయకుండా నోటాకు వేసినవారి సంఖ్య 5 లక్షలుగా ఉండటం గమనార్హం.

తమకు ఏ పార్టీ అభ్యర్థి నచ్చలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది ఓటర్లు నోటాకు ఓటు వేయడం విశేషం. గుజరాత్‌ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌లో నోటాకు పడిన ఓట్ల శాతం.. 1.5 కావడం గమనార్హం.

కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్‌ పునరావృతమైంది. ఆ ఎన్నికల్లో ఏకంగా 5,51,594 మంది నోటాకు ఓటేశారు.

ఇన్ని పార్టీలు పోటీ చేసినా ఇన్ని లక్షల మంది అభ్యర్థులు ఎవరినీ కాదని నోటాకు ఓటేశారంటే ఆలోచించాల్సిన విషయమేనంటున్నారు నిపుణులు. ఆయా పార్టీలు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ విషయం సూచిస్తోందని చెబుతున్నారు.

ప్రజలందరినీ ఆకట్టుకునేలా అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన అందిస్తే ఓట్లేయకుండా ఉంటున్నవారితోపాటు ఇలా తమ ఓటును ఏ అభ్యర్థికీ వేయకుండా నోటాకు వేసేవారిని ఆకర్షించవచ్చని చెబుతున్నారు.

కాగా గుజరాత్‌లో బీజేపీ విజయం సాధించడంలో మరోమారు భూపేందర్‌ భాయ్‌ పటేల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయనే గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.

డిసెంబర్‌ 12న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తదితరులు హాజరవుతారని సమాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.