Begin typing your search above and press return to search.

బీజేపీ, ఎస్పీలకు ‘నోటా’ దెబ్బ

By:  Tupaki Desk   |   2 Feb 2022 7:39 AM GMT
బీజేపీ, ఎస్పీలకు ‘నోటా’ దెబ్బ
X
మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ అయిపోయిన తర్వాత ఫలితాల సమయంలో మాత్రమే ఓట్ల వివరాలు బయటపడతాయి. ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని చెల్లలేదు, నోటాకు ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలు తెలుస్తాయి. కారణాలు ఏమైనా కానీండి ఈ మధ్య నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కు పడుతున్న ఓట్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఇపుడు ఇదంతా దేనికంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే బీజేపీ, ఎస్పీలకు తాము ఓట్లు వేసేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీలకు ఓట్లు వేసేది లేదని చెప్పిన రైతులు తమ ఓట్లను నోటాకు వేస్తామని లఖింపూర్ ఖేరి రైతులు స్పష్టంగా ప్రకటించారు. మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించిన బీజేపీ అంటే మండిపోతున్నారు. యూపీలోని లఖింపూర్ ఖేరిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా వాహనాన్ని ఎక్కించేసిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది చనిపోయారు.

రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిందే కాకుండా రైతులను ఉద్దేశ్యపూర్వకంగా చంపించిన బీజేపికి తాము ఓట్లు ఎలా వేస్తామంటు లఖింపూర్ రైతులు బాహాటంగానే మండిపోతున్నారు. అలాగే ఎస్పీకి కూడా ఓట్లు వేసేది లేదని చెప్పేశారు. కారణం ఏమిటంటే ఎస్పీ అధికారంలో ఉన్నపుడు రైతులకు మిల్లర్లు రు. 2 వేల కోట్లు ఇవ్వాల్సుందట. అప్పట్లో ఎస్పీ ప్రభుత్వం మిల్లర్ల తరపున మద్దతుగా నిలబడి ఆ రు. 2 వేల కోట్ల బకాయిలను ఏకపక్షంగా రద్దు చేసేసిందట. దాని వల్ల కొన్ని వేలమంది రైతులు నష్టపోయినట్లు ఇపుడు లఖింపూర్ రైతులంటున్నారు.

సో రైతుల ఆగ్రహం, నిర్ణయం చూస్తుంటే బీజేపీ, ఎస్పీలకు నోటా దెబ్బ గట్టిగానే తగిలేట్లుంది. తాము ఏ పార్టీకి ఓట్లు వేయదలచుకోలేదని రైతులు అంటున్నారు. అన్నీ పార్టీలు రైతులను మోసం చేసేవే అని తాము నిర్ధారణకు వచ్చినట్లు కూడా లఖింపూర్ రైతులంటున్నారు. అందుకనే తామంతా నోటాకు ఓట్లేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. రైతులు గనుక తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే నోటాకు పెద్ద ఎత్తున ఓట్లు రావటం ఖాయంగానే ఉంది. పోలింగ్ జరగకముందే నోటాకు ఎన్ని ఓట్లు పడతాయనే లెక్కలు పెరిగిపోతుండటమే విచిత్రంగా ఉంది.