Begin typing your search above and press return to search.

ఏపీలో రాజధాని కాక.. బీజేపీ ఎంట్రీతో రచ్చ రచ్చ..!

By:  Tupaki Desk   |   20 Dec 2020 3:00 PM IST
ఏపీలో రాజధాని కాక.. బీజేపీ ఎంట్రీతో రచ్చ రచ్చ..!
X
ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం ‘అమరావతి ’ అంశం హాట్​టాపిక్​గా మారింది. ఇంతకాలంగా అమరావతి రాజధానిగా ఉండాలి అనే అంశాన్ని కేవలం టీడీపీ మాత్రమే లేవనెత్తేది. కాంగ్రెస్​, వామపక్షాలు, జనసేన కూడా టీడీపీ బాటలోనే పయనించేవి. బీజేపీ మాత్రమ అమరావతి అంశంపై వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చింది. బీజేపీకి చెందిన జీవీఎల్​ లాంటి నేతలు అమరావతి రాష్ట్ర పరిధిలోని అంశం అని తప్పించుకొనేవారు. అయితే టీడీపీ లోనుంచి బీజేపీలోకి చేరిన ఎంపీలు సుజనా చౌదరి - సీఎం రమేశ్ లాంటి నేతలు మాత్రం బహిరంగంగానే అమరావతి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. సుజనా చౌదరికి అమరావతిలో భూములు ఉన్నాయని.. ఆయన బినామీలు అక్కడ భూములు కొన్నారని అధికార వైసీపీ ఆరోపణలు చేస్తున్నది.

అయితే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు బీజేపీలొని ఓ వర్గం (తెలుగుదేశం అనుకూల వర్గం) నేతలు అమరావతికి మద్దతుగా గట్టిగానే మాట్లాడేవారు.

వైసీపీ తీసుకొనే అన్ని నిర్ణయాలను తప్పుపట్టేవారు. టీడీపీ ఎదంటే బీజేపీలోని ఆ వర్గం నేతలంతా అదే పాటపాడేవారు. ఇదిలా ఉండే సడెన్​గా బీజేపీ అధిష్ఠానం కన్నా లక్ష్మీనారాయణను ఆ పదవి నుంచి తప్పించి బీజేపీ సీనియర్​ నేత సోము వీర్రాజుకు బాధ్యత​లు అప్పగించింది. అప్పటి నుంచి బీజేపీ లో ఉన్న టీడీపీ అనుకూల నేతల వాయిస్​ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. మరోవైపు సోము వీర్రాజు జగన్​పైనే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు పై కూడా ఘాటు విమర్శలు చేసేవారు.

రాజధాని అంశం చర్చకు వచ్చినప్పుడు ఆయన చంద్రబాబు తీరునే తప్పుపట్టేవారు. కానీ తాజాగా సోమువీర్రాజు స్టాండ్​ మార్చినట్టు కనిపిస్తున్నది. అమరావతి ఉద్యమం మొదలై ఏడాది పూర్తయిదంటూ ఇటీవల అమరావతిలో ఓ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు హాట్​ టాపిక్​గా మారాయి. ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుందని.. మోదీ మనిషిగా తాను ఈ మాట చెబుతున్నాను సోము వీర్రాజు కామెంట్​ చేశాడు. ఓ వైపు రాజధాని అంశం తమ పరిధిలోది కాదని కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది.

హైకోర్టుకు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కానీ సోమువీర్రాజు మాత్రం ఉన్నట్టుండి స్టాండ్​ మార్చారు. మరోవైపు సోమువీర్రాజు మాటలకు వైసీపీ కీలకనేత - పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయ​సాయిరెడ్డి కౌంటర్​ ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖపట్టణం పరిపాలనా రాజధానిగా అయి తీరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో వీరిద్దరి మాటలు యుద్ధం సాగుతున్నది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు .. అమరావతి అంశంపై ఇప్పుడు ఎందుకు అనుకూలంగా మాట్లాడారన్నది హాట్​ టాపిక్​ గా మారింది. ఆ పార్టీ అధిష్ఠానం చెబితేనే వీర్రాజు ఈ ప్రకటన చేశారా. అన్నది తెలియదు. అయితే కొంతకాలంగా అమరావతి అంశంపై బీజేపీ తన వైఖరి చెప్పాలంటూ ఓ వర్గం మీడియా ప్రశ్నిస్తున్నది. దీంతో సోము వీర్రాజు ఇటువంటి ఆరోపణలకు ఫుల్ ​స్టాప్​ పెట్టేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని సమాచారం.