Begin typing your search above and press return to search.

జపాన్ లోనే కాదు.. విద్యార్థి కోసం బస్సు టైమింగ్ మార్చేశారు

By:  Tupaki Desk   |   15 Jan 2021 6:00 AM IST
జపాన్ లోనే కాదు.. విద్యార్థి కోసం బస్సు టైమింగ్ మార్చేశారు
X
అక్కడెక్కడో అలా చేస్తున్నారు. ఇక్కడ చూశారా? అలాంటివేమీ లేవని పెదవి విరిచేవారు ఉంటారు. తరచి చూస్తే.. మనలోనూ మార్పు వచ్చింది. కొన్ని సున్నితమైన అంశాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైనం చూసినప్పుడు వావ్ అనాల్సిందే. అలాంటి ఉదంతం ఒకటి తాజాగా ఒడిశాలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రపంచ వ్యాప్తంగా ఉండే పలు ఆసక్తికర అంశాలు తెలుసుకునే వెసులుబాటు ఉంది.

ఇలాంటివేళ.. ఒక పోస్టు చాలా కాలం నుంచి తిరుగుతుంటుంది. దాని సారాంశం.. జపాన్ లో ఒక విద్యార్థి కోసం అక్కడి అధికారులు.. ప్రత్యేకంగా రైలు వేశారు. ఇలాంటివి మన దగ్గర ఊహించగలమా? అని పలువురు ప్రశ్నిస్తుంటారు. రైలు కాకున్నా.. విద్యార్థి కోసం బస్సు టైమింగ్ మార్చేసిన ఉదంతం తాజాగా ఒడిశాలో చోటు చేసుకుంది. భువనేశ్వర్ లోని ఎంబీఎస్ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదివే సాయి అన్వేష్ ప్రతి రోజు పబ్లిక్ ట్రాన్స్ పోర్టులోనే స్కూల్ కు వెళతాడు. అతడి స్కూలు ఉదయం ఏడున్నరకు అయితే.. అతడు వెళ్లే బస్సు మాత్రం 7.40కు రావటం.. ప్రతి రోజు టీచర్ల చేత తిట్టించుకోవటం అలవాటైంది.

తన ఇబ్బందికి తానే పరిష్కరించుకునేందుకు ఆ కుర్రాడు సరికొత్తగా ఆలోచించాడు. తన వేదనను క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్ పోర్టు సంస్థ ఎండీ అరుణ్ బొత్రాకు ట్వీట్ చేశాడు. బస్ టైమింగ్ కారణంగా తాను రోజు పాఠశాలకు ఆలస్యంగా వెళుతున్నట్లుగా పేర్కొన్నాడు. ‘‘దయతో మీరు నా ఇబ్బందిని అర్థం చేసుకోండి. స్కూల్ కు సమయానికి వెళ్లేలా చర్యలు తీసుకోగలరు’’ అని పేర్కొన్నారు. అతను ట్వీట్ పోస్టు చేసిన కొన్ని గంటలకే అరుణ్ బొత్రా స్పందించారు.

త్వరలోనే బస్ టైమింగ్స్ మారుస్తానని హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్లే బస్సు టైమింగ్ మార్చేయటంతో సాయి అన్వేష్ సమయానికి స్కూల్ కు వెళ్లగలుగుతున్నాడు. స్కూల్ విద్యార్థి చేసుకున్న విన్నపాన్ని మన్నించి.. బస్సు టైమింగ్ మార్చిన వైనంపై పలువురుప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అక్కడలా చేస్తారని చెప్పుకోవటం కాదు.. మనం దగ్గర కూడా మార్పులు జరుగుతున్నాయన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది.