Begin typing your search above and press return to search.

దళిత బంధే కాదు.. టైమొస్తే బీసీ బంధు కూడా

By:  Tupaki Desk   |   25 Aug 2021 3:29 AM GMT
దళిత బంధే కాదు.. టైమొస్తే బీసీ బంధు కూడా
X
అనుకోవాలే కానీ వేలాది కోట్లను పప్పు బెల్లాల మాదిరి పంచిపెట్టే సత్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. రాష్ట్రం ఏమిటి?రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు సీఎంలు. అందుకు భిన్నంగా తక్షణ పొలిటికల్ మైలేజీ కోసం దేనికైనా సిద్ధమన్న విషయాన్ని తేల్చి చెబుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించి.. అమలు చేస్తున్న దళితబంధు రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలకు కారణమవుతుందని చెప్పాలి.

ఎవరెన్ని చెప్పినా హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ.. తెర మీదకు వచ్చిన దళితబంధుఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా మాట్లాడిన కేసీఆర్ తన అమ్ములపొదిలో ఉన్న మరోభారీఅస్త్రాన్నిబయటకు తీశారు.అన్ని అనుకున్నట్లు జరిగితే బీసీ బంధు కూడా ఉంటుందన్న మాట చెప్పి.. కొత్త ఆశలు రేపేలా చేశారని చెప్పాలి. ఒక్క బీసీ బంధు మాత్రమే కాదు.. మైనార్టీ ఇతర బంధులు కూడా తామే పెట్టాలన్న కేసీఆర్.. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్సే పవర్లోకి ఉంటుందన్నారు.

మనమే చేస్తాం.. మనమే చేయగలుగుతామన్న ఆయన..అన్ని సామాజిక వర్గాల్లోనూ పేదలు ఉన్నారని.. వారినీ ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. పేదరిక పిరమిడ్ లో అట్టడుగునదళితులు ఉన్నారని.. అందుకేవారికి మొదట దళిత బంధును ప్రకటించామని వ్యాఖ్యానించారు. మంగళవారం టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఎప్పటిలానే అదరగొట్టే ప్రసంగంతో కేసీఆర్ ఆకట్టుకున్నారు. పార్టీ నేతలకు ఉన్న పలు సందేహాలకు తన ప్రసంగంతో సమాధానం చెప్పారు.

దళిత బంధు పథకం మీద వస్తున్న విమర్శల్ని ఆయన ఘాటుగా రియాక్టు అయ్యారు. ‘‘దళిత బంధు అంటూ ఒక పథకం పెట్టగానే.. కత్తి లేనోడు.. నెత్తి లేనోడు విభేదాలు సృష్టించే విధంగా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఆ బంధు పెట్టు.. ఈ బంధు పెట్టు అని అంటున్నారు. ఇన్నేళ్లలో ఎన్నో పార్టీలు వచ్చాయి..పోయాయి. కానీ, ఈ తరహా ఆలోచన ఎవరూ, ఎన్నడూ చేయలేదు. ఆ బంధు పెట్టినా.. ఈ బంధు పెట్టినా.. ఏ బంధు పెట్టినా మనమే పెట్టాలి. పెట్టగలుగుతాం. టైమొస్తే బీసీ బంధు పెడతాం. మైనారిటీ బంధు.. ఇతర బంధులు కూడా పెడతాం. ఏది చేసినా మనమే చేయగలుగుతాం. వేరే వాళ్లు ఎవరూ పెట్టరు. ఎవరితోనూ కాదు. రాష్ట్రంలో ఇంకో ఇరవై ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. మనమే చేస్తాం’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల బాగోగులు పట్టించుకుంటున్నామని.. దేశంలోమరెక్కడా లేని రీతిలో రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని.. ఒక్కో సామాజిక వర్గం ఆర్థిక పుష్టి కోసంఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దళితుల ఆర్థిక సామాజిక అభ్యున్నతి కోసం దళితబంధును అమలు చేస్తే తప్పేంటంటూ తనను తప్పు పట్టే వారిని సూటిగా నిలదీశారు. ఆయన ఇంకేమన్నారంటే..

- సమాజంలో 17 శాతం జనాభా కలిగిన దళితులు కేవలం పేదలు మాత్రమే కాదు. సామాజికంగా, కులపరంగా వివక్షకు గురవుతున్న ఏకైక వర్గం. వారిలో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకు రావాలనే మంచి సంకల్పంతోనే దళిత బంధు అమలు చేస్తున్నాం.

- రాష్ట్రంలో ఇతర పార్టీలు రాణించటానికి అవకాశం లేదు. క్షేత్రంలో ఎంత పని చేస్తే టీఆర్‌ఎస్‌ అంత బలోపేతం అవుతుంది. దళిత బంధుతో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. దీనిపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలి.

- టీవీ చానళ్లలో జరిగే చర్చలు, మీడియా సమావేశాల ద్వారా పార్టీ వాణిని బలంగా వినిపించాలి. ‘దళిత బంధు’పై ప్రజలను చైతన్యపర్చాలి. పథకాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి.