Begin typing your search above and press return to search.

కార్పొరేట్ వార్నింగ్ ఇస్తున్నాడు.. ఆటో కొట్టుకెళ్లింది

By:  Tupaki Desk   |   18 Oct 2020 10:20 AM IST
కార్పొరేట్ వార్నింగ్ ఇస్తున్నాడు.. ఆటో కొట్టుకెళ్లింది
X
వర్షాలతో అతలాకుతలమవుతున్న హైదరాబాద్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆకాశం ముబ్బు పడితే చాలు..నగర జీవి భయపడిపోతున్నాడు. బెదిరిపోతున్నారు. ఏమవుతుందో అని కంగారు పడిపోతున్నాడు. దీనికి తగ్గట్లే.. చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతే తీవ్రంగా ఉన్నాయి. మొన్న కురిసిన భారీ వర్షాలతో వాహనాలే కాదు.. సికింద్రాబాద్ లో ఒక ఇల్లే కొట్టుకుపోవటం షాకింగ్ గా మారింది. ఇక.. పెద్ద పెద్ద వాహనాలు కూడా కొట్టుకెళ్లిపోయిన ఉదంతాలెన్నో.

శనివారం ఉదయం నుంచి వాతావరణం మామూలుగా ఉండటమే కాదు.. ఎండ కూడా బాగానే ఉన్న పరిస్థితి. అలాంటిది సాయంత్రం నాలుగైదు గంటల వేళలో మారిన వాతావరణ మార్పులతో హైదరాబాద్ ను వర్షం కమ్మేసి.. కుమ్మేసింది. నాలుగైదు రోజుల కిందటి చేదు అనుభవాల నుంచి ఇంకా బయటకు రాని నగర జీవి.. ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా స్థానిక కార్పొరేటర్లు.. ఎవరికి వారు బయటకు వచ్చి.. వర్షం వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు.

వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వారంతా.. ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లిపోండి.. కింద ఎవరు ఉండొద్దు.. విలువైన వస్తువుల్ని మీతో పైకి తీసుకెళ్లండంటూ చాంద్రాయణగుట్ట కార్పొరేటర్ ప్రజలకు చెబుతున్న వేళ.. ఆయన పక్క నుంచి ఆటో ఒకటి వరద నీటిలో కొట్టుకుపోయిన వైనం షాకింగ్ గా మారింది. ఇలాంటి ఉదంతాలు హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య కాలంలో ఘట్ కేసరిలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

నగరానికి వస్తే.. బండ్లగూడలో 15.3 సెం.మీ., నాగోలులో 14.2 సెం.మీ., కందికల్ గేట్ 14.1సెం.మీ., షేక్ పేట 13.5సెం.మీ., అల్కాపూర్ 13.2సెం.మీ., ఎల్ బీ నగర్ 12.9సెం.మీ., హయత్ నగర్ 12.2సెం.మీ, అబ్దుల్లాపూర్ మెట్ 11.4సెం.మీ. వర్షపాతం నమోదైంది.