Begin typing your search above and press return to search.

ముద్రగడకు బీజేపీలో చేరే ఆసక్తి లేదా ?

By:  Tupaki Desk   |   17 Jan 2021 12:00 PM IST
ముద్రగడకు బీజేపీలో చేరే ఆసక్తి లేదా ?
X
ముద్రగడ పద్మనాభంకు బీజేపీలో చేరే ఆసక్తి లేదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. శనివారం కమలంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్ళి భేటి అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా జరిగిన భేటిలో ముద్రగడను బీజేపీలో చేరమని వీర్రాజు ఆహ్వానించారు. అయితే ప్రస్తుత పరిస్దితుల్లో తాను కమలంపార్టీలో చేరే అవకాశాలు లేవని ముద్రగడ స్పష్టం చేసినట్లు సమాచారం.

కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై తాను పోరాటం చేస్తున్న విషయాన్ని కమలంపార్టీ అధ్యక్షునికి ముద్రగడ గుర్తుచేశారట. ఈ పరిస్దితుల్లో తాను గనుక ఏదైనా పార్టీలో చేరితే తన పోరాటం డైల్యూట్ అయిపోతుందని ముద్రగడ స్పష్టంగా చెప్పారట. ఇదే విషయమై వీర్రాజు మాట్లాడుతూ కాపులకు బీసీల రిజర్వేషన్ వర్తింపచేసే అంశాన్ని తమపార్టీ టేకప్ చేస్తుందని హామీ ఇచ్చారట. అయినా సరే తాను ప్రస్తుత పరిస్ధితుల్లో బీజేపీలో చేరలేనని చెప్పేశారట.

తాను చేస్తున్న పోరాటం పార్టీలకు అతీతంగా చేయాలని అనుకుంటున్న కారణంగా తనపై ఓ పార్టీ ముద్రపడటం ఇష్టం లేదని చెప్పారట. అయితే అవసరమైనపుడు తనకు వీలైనంతగా బీజేపీకి మద్దతు ఇస్తానని అయితే బీజేపీ, జనసేనలు కాపు రిజర్వేషన్ అంశాన్ని భుజానికెత్తుకోవాలని షరతు విధించినట్లు సమాచారం. ఏదేమైనా ముద్రగడను బీజేపీలోకి తీసుకోవాలని వీర్రాజు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని అర్ధమవుతోంది.

ఇక్కడ వీర్రాజు గమనించాల్సిన విషయం ఏమిటంటే కాపు సామాజికవర్గంలోనే ముద్రగడను వ్యతిరేకించే వారు చాలామందే ఉన్నారు. కాపునాడు సంఘంలోని సీనియర్ నేతలెవరూ ముద్రగడను కాపు ఉద్యమనేతగా గుర్తించటానికి ఇష్టపడరు. ఎందుకంటే తన గొంతెమ్మకోర్కెలతో, ఆచరణసాధ్యంకాని డిమాండ్లతో కాపు ఉద్యమాన్ని పలుచన చేశాడని ముద్రగడపై చాలామంది కాపు నేతలు మంటగా ఉన్నారు.

మొన్నటికి మొన్న ఎన్నికల్లో ముద్రగడ చెప్పినా కాపులు వినకుండా తూర్పుగోదావరి జిల్లాలోని టీడీపీని నాలుగు అసెంబ్లీల్లో గెలిపించారు. ఇదే సమయంలో వైసీపీకి ఓట్లేయమని ముద్రగడ ఎక్కడా చెప్పకపోయినా ఎంపిలు, ఎంఎల్ఏల సీట్లలో గెలిపించారు. కాపులకు రిజర్వేషన్ల అంశం తన చేతిలో లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేసిన తర్వాత కూడా జనాలు వైసీపీకే ఓట్లేశారంటే అర్ధమేంటి ? ముద్రగడ పోరాటంతో జరిగేదేమీ లేదని జనాలకు అర్ధమైపోయింది. మరి కాపులకు బీసీల రిజర్వేషన్లనే అంశంపై ముద్రగడ పోరాటం చేస్తానంటే ఇంకా నమ్మేజనాలున్నారా ?