Begin typing your search above and press return to search.

ఆ దేశంలో 200 రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాలేదట !

By:  Tupaki Desk   |   30 Oct 2020 4:10 PM IST
ఆ దేశంలో 200 రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాలేదట !
X
ప్రపంచ వ్యాప్తంగా కొరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ కారణంగా పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఇలా కొనసాగుతుంటే .. కరోనా మహమ్మారిని సమూలంగా కట్టడి చేసి ద్వీప దేశం తైవాన్‌ కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 200 రోజుల్లో తమ దేశంలో స్థానికంగా ఒక్క వైరస్‌ కేసు కూడా నమోదు కాలేదని అక్కడి అధికారులు ప్రకటించారు. 2.3కోట్ల జనాభా కలిగిన తైవాన్‌ లో ఇప్పటివరకు కేవలం 553 కేసులు నమోదుకాగా, ఏడుగురు మాత్రమే కరోనా మహమ్మారి కారణంగా మరణించారు.

కరోనా ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన తైవాన్‌ జనవరిలోనే సరిహద్దుల వద్ద కఠిన ఆంక్షలు విధించింది. దేశంలోకి వచ్చే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం తో పాటు 14రోజుల పాటు వారిని క్వారంటైన్ ‌లో ఉంచి పర్యవేక్షించింది. కరోనా రోగికి సన్నిహితంగా మెలిగిన 20 నుంచి 30 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించింది. ఒకానొక సమయంలో 150 మంది వరకూ పరీక్షించింది. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వారికి కూడా క్వారంటైన్‌ విధించింది. ఇలా ఏకంగా 3.4 లక్షల మందిని క్వారంటైన్‌ లో ఉంచింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించింది.

అలాగే , వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన వెంటనే మాస్కుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. రోజుకు 20 లక్షలుగా ఉన్న మాస్కుల ఉత్పత్తిని.. 2 కోట్లకు పెంచి ప్రజలకు పంపిణీ చేసింది. దీంతో మాస్కుల కొరత తీరింది. 2003లో సార్స్‌ అంటువ్యాధి విరుచుకుపడి తైవాన్ ‌లో 73 మంది మరణించారు. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు.అలాగే ఏ మాత్రం అజాగ్రత్తగా లేకుండా అన్ని నియమాలు పాటిస్తూ .. కరోనా మహమ్మారి పై విజయం సాధించారు.