Begin typing your search above and press return to search.

సుహాసిని గెలుపు.. అంత ఈజీ కాదట..

By:  Tupaki Desk   |   19 Nov 2018 11:35 AM GMT
సుహాసిని గెలుపు.. అంత ఈజీ కాదట..
X
కూకట్ పల్లి.. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఈ సీటు ఆది నుంచి టీడీపీకి బాగా బలమున్న నియోజకవర్గంగా ఉంది. తాజా ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సీటును హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి కట్టబెట్టారు. ఆమె కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా టీడీపీ నాయకులు, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తో నామినేషన్ కూడా వేసేశారు. అయితే నందమూరి సుహాసిని అభ్యర్థిత్వంపై నియోజకవర్గం నేతలు - ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నందమూరి సుహాసిని ప్రచార పర్వంలో చాలా వెనుకబడి ఉంది. ఇప్పటికే టీఆర్ ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణరావు ఎప్పుడో ప్రచారం మొదలుపెట్టి ప్రజలకు చేరువయ్యారు. అంతేకాకుండా గడిచిన నాలుగున్నరేళ్లుగా మాధవరం కూకట్ పల్లి ప్రజలతో మమేకమయ్యారు. స్థానిక ఓటర్లు - ప్రజల సమస్యల గురించి ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. 2014లో టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి నుంచి గెలిచిన మాధవరం అనంతరం అభివృద్ధి కోసం టీఆర్ ఎస్ లోకి దూకినప్పటికి కూకట్ పల్లి ప్రజలు - నాయకుల నుంచి ఈయనపై వ్యతిరేకత ఏమీ వ్యక్తం కాలేదు.

కానీ నందమూరి సుహాసిని కూకట్ పల్లి ప్రజలకు పూర్తిగా కొత్తవారు. పైగా స్థానికురాలు కూడా కాదు... స్థానిక సమస్యలపై కూడా ఆమెకు అవగాహన లేదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఆమె నియోజకవర్గంలో ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో తిరిగింది లేదు. సుహాసిని ప్రజల్లోకి ఎంత వేగంగా వెళ్లినా మాధవరం స్థాయిలో ప్రజలకు చేరువ కావడం కష్టమైన పనే అంటున్నారు విశ్లేషకులు.. సుహాసిని ఎంత వేగంగా స్పందించి ముందడుగు వేసినా ఈ ఎన్నికల ప్రచారంలో మాధవరంను అందుకోవడం కష్టమేనని నియోజకవర్గ నేతలు చెబుతున్నారు.

సుహాసిని ఎమ్మెల్యేగా గెలిచినా స్థానికంగా ఉండరనే ప్రచారం కూకట్ పల్లి ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని వారు అడుగుతున్నారు. స్థానికులతో సత్సంబంధాలున్న వారినే గెలిపిస్తే తమకు అందుబాటు ఉంటారు కదా అని కూకట్ పల్లి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సినీ నిర్మాత భవ్య ఆనంద ప్రసాద్ లాంటి వాళ్లు కూడా శేర్ లింగంపల్లి నియోజకవర్గానికి కొత్తగా వలస వచ్చిన నేత. ఇలాంటి వారు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఒకేసారి ధన - ఆర్థిక - పరపతి ఉపయోగించి పోటీకి టికెట్ సంపాదిస్తున్నారు. కానీ స్థానికులు కాకపోవడంతో ప్రజల మెప్పు పొందలేకపోతున్నారు. తమతోపాటు ఉండి.. తమ సమస్యలపై అవగాహన ఉన్నవారినే గెలిపిస్తామని స్థానిక ప్రజలు ఘంఠాపథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీల మద్దతుతో టికెట్ దక్కించుకున్న పాపులర్ ప్రముఖులకు ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు ఖాయంగా కనిపిస్తోంది.