Begin typing your search above and press return to search.

కిమ్ కొత్త పల్లవి.. ఉన్నట్టుండి చైనా భజన

By:  Tupaki Desk   |   7 Oct 2020 11:30 PM GMT
కిమ్ కొత్త పల్లవి.. ఉన్నట్టుండి చైనా భజన
X
ఊరకే పొగడ్తలు పలకరు కొందరు మహానుభావులు. తమ అవసరాల కోసం ఎవరినైనా పొగుడుతూ భజన చేస్తుంటారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఎవరికీ అర్థం కాడు. వివాదాలతో, తన ప్రవర్తనతో ఏకంగా ఆధునిక నియంత అని పేరు తెచ్చుకున్నారు. తమ దేశానికి సైనిక శక్తిసామర్థ్యాలు తక్కువగా ఉన్నా కూడా యుద్ధంలో తలపడేందుకు అమెరికాను కవ్విస్తూ ఉంటాడు. సముద్రాల్లో అణుబాంబులను పరీక్షిస్తూ అమెరికాను రెచ్చగొడుతుంటాడు. మరోవైపు ఇటీవల చైనాకు అమెరికాకు మధ్య పొసగడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా చైనా పై మాటల తూటాలు పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ చైనాపై ప్రశంసల జల్లు కురిపించాడు. జిన్ పింగ్ తో కలసి అడుగులు వేస్తానంటూ పేర్కొన్నాడు.

చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 71 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న జిన్‌పింగ్‌కు కిమ్ ఓ లేఖ పంపారు. అందులో కిమ్ చైనాకు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటానన్నారు. తన దేశ ప్రజలు, తన పార్టీ ఎప్పటికీ చైనాకు, చైనా ప్రజలకు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అండగా ఉంటుందని చెప్పారు. సోషలిజం నెలకొల్పే క్రమంలో చైనా ప్రజలు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ, కార్యకర్తలు తమ రక్తాన్ని చిందించారన్నారు. ఈ 71 ఏళ్ల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఎన్నో విజయాలను నమోదు చేసిందని కిమ్ ప్రశంసించారు.

అందులో కొన్ని దేశాలు చైనాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, జింగ్‌పింగ్‌పై తప్పుడు ప్రచారం చేసి చైనా ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. అటువంటి కుటిల ప్రయత్నాలను మానుకోవాలని కిమ్ లేఖలో సూచించారు. కిమ్ చైనా అధినేతకు లేఖ రాసి అండగా ఉంటానని చెప్పడం శత్రువు, శత్రువు ఏకం అయినట్లు ఉందని అంతా భావిస్తున్నారు. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య పరంగాకానీ, ఇతర విషయాల్లో కానీ పడడం లేదు. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్న తరుణంలో కిమ్ చైనాకు మద్దతు తెలుపుతూ లేఖ రాయడం సంచలనంగా మారింది.