Begin typing your search above and press return to search.

ఐరాస మీటింగులోనే తొడగొట్టిన నార్త్ కొరియా

By:  Tupaki Desk   |   24 Sep 2016 9:48 AM GMT
ఐరాస మీటింగులోనే తొడగొట్టిన నార్త్ కొరియా
X
ఉత్తర కొరియా అంటే కొరకరాని కొయ్య అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అణ్యాయుధాల విషయంలో అన్ని దేశాలూ గోప్యత పాటించడమో.. నిబంధనలు పాటించడమో చేస్తుంటే ఉత్తర కొరియా మాత్రం తరచూ వాటిని ప్రయోగిస్తూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతుంది. ఇటీవల కూడా నార్త్ కొరియా తన అణ్వస్ర్ర పరీక్షలతో అలజడి రేపింది. అణు ఆయుధాల పరీక్షల కారణంగా ఇప్పటికే ఆంక్షలు ఎదుర్కొంటున్నా ఏమాత్రం తగ్గని ఆ దేశం అల్లరి పిల్లాడిలా మారి అగ్రదేశాలను ఆటాడిస్తోంది. తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోనూ అడ్డంగా మాట్లాడి అన్ని దేశాలకూ ఆగ్రహం తెప్పించింది.

అణు పరీక్షలు జరిపే విషయంలో కానీ... కొత్తగా అణ్వాయుధాలను తయారుచేసుకునే విషయంలో కానీ తాము ఏమాత్రం తగ్గబోమని... తమ వైఖరి ఇలాగే ఉంటుందని ఉత్తర కొరియా ఐక్యరాజ్యసమితి వేదికపై స్పష్టం చేసింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు తాము దేనికైనా సిద్ధమని ప్రకటించింది. ఇప్పటికే అణ్వాయుధాలున్న దేశాలు తమను బెదిరిస్తున్నాయని చెబుతూ... అలాంటి దేశాలకు కానీ, ఐరాస ఆంక్షలకు కానీ తాము ఏమాత్రం భయపడబోమని చెప్పింది.

అంతేకాదు... పనిలో పనిగా అమెరికాపై మండిపడింది. అమెరికా నుంచి తమకు ముప్పు ఉందని.. అందుకే ఆత్మరక్షణకు అణ్వాయుధాలను రెడీ చేసుకుంటున్నామని చెప్పింది. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను ఆత్మరక్షణకు మాత్రమే వాడుతామని చెప్పడంతో కొంతలో కొంత నయమంటూ పలు దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. తమ దేశ రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌ ను ఆక్రమించాలని అమెరికా - దక్షిణ కొరియా కుట్ర చేస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తాము ఆయుధాలు సమకూర్చుకుంటున్నామని ఉత్తరకొరియా ప్రకటించింది. అమెరికా ఏమైనా ఎక్సట్రాలు చేస్తే దిమ్మ తిరిగే షాకిస్తామని కూడా ఉత్తర కొరియా ఐరాస వేదికపైనే వార్నింగ్ ఇచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/