Begin typing your search above and press return to search.

కొరియా తుస్సుమంద‌ని తేలిపోయింది

By:  Tupaki Desk   |   17 April 2017 6:33 AM GMT
కొరియా తుస్సుమంద‌ని తేలిపోయింది
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గ‌ర్జన‌లు అంతా ఉత్తివేన‌ని తేలిపోయింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స‌మ‌క్షంలో ఉత్తర కొరియా ప్రభుత్వం శనివారం భారీ సైనిక పరేడ్ నిర్వహించి తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించిన మరుసటి రోజే ఈ క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమైంది. అయితే ఇది ఏ తరహా క్షిపణి అన్నది ఇంకా తెలియరాలేదని అమెరికా పసిఫిక్ కమాండ్ (యుఎస్‌ పిఎసిఓఎం) ఒక ప్రకటనలో పేర్కొంది. కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమైందని, ప్రయోగించిన కొద్దిసేపటికే ఆ క్షిపణి పేలిపోయిందని అమెరికా సైనిక దళం వెల్లడించింది. ఉత్తర కొరియా తూర్పు తీర నగరమైన సిన్పో సమీపం నుంచి ప్రయోగించిన ఈ బాలిస్టిక్ క్షిపణిని తాము గుర్తించి, దానిని ఉత్తర కొరియాకు చెందిన క్షిపణిగా నిర్ధారించామని అమెరికా పసిఫిక్ కమాండ్ అధికార ప్రతినిధి సిడిఆర్ డేవ్ బెన్హామ్ తెలిపారు.

మ‌రోవైపు అంత‌కుముందు రోజే కొరియా రణ‌రంగం స్థాయిలో ఘీంక‌రించింది. అగ్రరాజ్యమని విర్రవీగుతూ కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో యుద్ధ పరిస్థితులను సృష్టిస్తున్న అమెరికా నుంచి తమకు ఎటువంటి ముప్పు ఎదురైనా దీటుగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ‘పెద్దన్న’పై భీకర స్థాయిలో అణు యుద్ధానికి దిగేందుకు సైతం వెనుకాడేది లేదని ఉత్తర కొరియా హెచ్చరించింది. సెంట్రల్ ప్యాంగ్యాంగ్‌ లో భారీ సైనిక పరేడ్‌ ను నిర్వహించిన ఉత్తర కొరియా, తమ అత్యాధునిక ఖండాంతర క్షిపణులతో పాటు ఇతర ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరు వలన ప్రాంతీయ స్థాయి ఉద్రిక్తతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు తన ఆయుధ పాటవాన్ని చాటి చెప్పేందుకు ఉత్తర కొరియా ఈ సైనిక ప్రదర్శనను నిర్వహించింది. ఉత్తర కొరియా వ్యవస్థాపక పాలకుడు కిమ్-2 సంగ్ 105వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ సైనిక ప్రదర్శనలో ఆయన మనువడు - ప్రస్తుత దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నప్పటికీ ఆయన ఏమీ మాట్లాడలేదు.

అయితే అధ్యక్షుడు కిమ్ జోంగ్ తర్వాత దేశంలో అంతటి స్థాయి నాయకుడిగా పరిగణించే సైనిక ఉన్నతాధికారి చోయ్ ర్యోంగ్ హాయి అమెరికాను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ప్రాంతానికి తమ బలగాలను పంపడం ద్వారా కొరియా ద్వీపకల్పంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ను ‘నేరస్థుడు’గా ఆయన అభివర్ణించారు. అమెరికా నుంచి తమకు ఎటువంటి ముప్పు ఎదురైనా పూర్తిస్థాయి యుద్ధానికి దిగి దీటుగా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే తమదైన శైలిలో ‘పెద్దన్న’పై అణు దాడులు నిర్వహించేందుకు సైతం వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాగా, ఆ మ‌రుస‌టి రోజే ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టం ఆస‌క్తిక‌రం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/