Begin typing your search above and press return to search.

అణుబాంబుల దేశంలో..ఆక‌లి కేక‌లు

By:  Tupaki Desk   |   24 Feb 2019 1:39 PM GMT
అణుబాంబుల దేశంలో..ఆక‌లి కేక‌లు
X
రోజుకో మిస్సైల్, వారానికో ఆటంబాంబును పరీక్షిస్తూ, ఆయుధ సంపత్తిని భారీగా పోగేసుకున్న ఉత్తరకొరియా ప్రస్తుతం ఆహార మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. నిన్నటిదాకా నోరు తెరిస్తే ఆటంబాంబులు తప్ప మరో మాటెరగని కిమ్ జాంగ్ ఉన్, ఇప్పుడు అన్నం కోసం అర్రులుచాచారు. సొంత జనానికి సరిపడా తిండిపెట్టలేని స్థితిలో కిమ్, సాయం చేయండంటూ ఐక్యరాజ్యసమితి(యూఎన్ ఓ) తలుపుతట్టారు. యూఎన్ ఓలో ఉత్తరకొరియా అంబాసిడరైన కిమ్ సాంగ్ ఈ మేరకు డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(డీపీఆర్ కే) ప్రభుత్వం తరఫున యూఎన్ సెక్రటరీ జనరల్‌ కు లెటర్‌ రాశారు. 2019లో ఉత్తరకొరియాలో 14 లక్షల టన్నుల ఆహారదినుసుల కొరత ఎదుర్కొంటున్నదని, జనవరి నుంచే రేషన్ లో కోతల్ని విధించామని దాంట్లో వివరించారు. దిగుమతులు పెంచుకునేందుకు వీలుగా ఉత్తరకొరియాపై ఉన్న ఆంక్షల్ని ఎత్తేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

ఉత్త‌ర‌కొరియా భౌగోళిక స్థితిగ‌తులు పూర్తిగా భిన్న‌మైన‌వి. ఉత్తరకొరియా మొత్తం భూభాగంలో కేవలం 17 శాతం మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా వసతులు పెంచకపోవడంతో రైతులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు పండిస్తున్నారు. ఆ కొద్దిపాటి ఫలాన్నే రేషన్‌ గా విభజించి జనాభాకు పంచుతారు. చాలీచాలని తిండి కారణంగా సుమారు కోటి మందిలో పౌష్టికాహారలోపాలు తలెత్తాయి. పిల్లల్లో ఎదుగుదల క్షీణించింది .1990లో తలెత్తిన కరువు 3లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇక, గడిచిన రెండు సంవ‌త్స‌రాలుగా సరైన వర్షాలు లేక పంటల దిగుబడులు బాగా తగ్గిపోయాయి. 2017లో 5.3 మిలియన్ టన్నులుగా ఉన్న దినుసుల దిగుబడి, 2018 నాటికి 4.9 మిలియన్ టన్నులకు పడిపోయింది. 2019లో ఆ సంఖ్య మరింత పడిపోవడంతో ఆర్తనాదాలు పెరిగాయి. ఆహార కొరత కారణంగా దేశంలోని బ్లూ, వైట్ కాలర్ వర్గాలకు అందించే రేషన్‌లో ప్రభుత్వం కోత విధించింది. కాగా, ఆహార కొరతను అధిగమించేలా విదేశాల నుంచి 4లక్షల పౌండ్ల దినుసుల్ని దిగుమతి చేసుకోవాలని ఉత్తరకొరియా భావిస్తున్నా, యూఎన్ ఓ ఆంక్షలు అడ్డుపడుతున్నాయి. దీంతో కిమ్ జాంగ్ తెలివిగా యూఎన్ఓనే సాయమడిగారు. ‘మానవతాకోణంలోనైనా ఉత్తరకొరియాపై ఆంక్షలు సడలించండి. లేకపోతే, ఆకలిచావులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ఇదే స‌మ‌యంలో, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ తో భేటీకి సరిగ్గా రెండ్రోజుల ముందు కిమ్ ప్రభుత్వం ఐక్య‌రాజ్య‌స‌మితికి లేఖ‌ రాయడంలో రాజకీయ మతలబు ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. హనోయిలో ఈ నెల 26న రెండు దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. గతేడాది సింగపూర్ వేదికగా జరిగిన తొలి రౌండ్ చర్చల్లో అణ్వాయుధాల్ని నిర్వీర్యం చేస్తానని కిమ్ జాంగ్ మాటిచ్చినా, దాన్ని ఆచరించలేదు. ‘తాజా లేఖలో చాలా ఘాటు పదాలు వాడారు. ఆంక్షల్ని ఎత్తేయకుంటే అది ఆకలిచావులకు దారితీస్తుందన్నారు. ఒకరకంగా ఇది యూఎన్ఓ, యూఎస్ ను బెదిరించడమే ’ అని నార్త్కొరియా ఎకానమీ వాచ్ కోఎడిటర్ బెంజిమన్ సిల్బర్ట్సైన్ అన్నా రు. ఉత్తరకొరియాకు కావాల్సింది ఆంక్షల ఎత్తివేత మాత్రమేనని, కాబట్టి ట్రంప్ తో భేటీకి ముందే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకురాలు సూమీ టెర్రీ వివరించారు.