Begin typing your search above and press return to search.

అమెరికాలోనూ కోడి పందేలు

By:  Tupaki Desk   |   21 Dec 2017 4:46 PM GMT
అమెరికాలోనూ కోడి పందేలు
X
అమెరికాలో భారీ సంఖ్యలో పందెం కోళ్లను పట్టుకున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. అమెరికాలో ఏంటి? పందెం కోళ్లేంటి అనుకుంటున్నారా? నిజమే.. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.. ఈ ఏడాది లాస్ ఏంజిల్స్ పోలీసులు ఏకంగా 8 వేల కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. లాస్ ఏంజెల్స్ - చుట్టుపక్కల ప్రాంతాల్లో కోళ్ల పందేలు వేసే ముఠాలున్నాయట. కొందరు ఇళ్లలోనూ పందెం కోళ్లను ఎక్కువ సంఖ్యలో పెంచుతుండడంతో దీన్ని నియంత్రించడానికి చర్యలకు సిద్ధమవుతున్నారు.

గత మే నెలలో 80 ఎకరాల స్థలంలో పెంచుతున్న 7 వేల కోడిపుంజులను పట్టుకున్నారు. అమెరికా చరిత్రలోనే అంత భారీ సంఖ్యలో ఎప్పుడూ కోడిపుంజులను పట్టుకోలేదు. అప్పుడు కోడిపుంజులతో పాటు వాటి కాళ్లకు కట్టే రకరకాల చురకత్తులను... కోళ్లకు ఇంజక్షన్ చేయడానికి ఉంచిన స్టెరాయిడ్లు - ఇంజక్షన్ సిరంజిలను కూడా భారీ మొత్తంలో పట్టుకున్నారు. నెల రోజుల కిందట కూడా సుమారు 500 పందెం కోళ్లను పట్టుకుని ఆ ముఠా కార్యకలాపాలను అడ్డుకున్నారు.

కాలిఫోర్నియాలోని వివిధ కౌంటీల్లో కోళ్ల పెంపకం, పందేలను నియంత్రించే చట్టాలున్నాయి. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ చుట్టుపక్కలున్న కౌంటీల్లోనూ ఇలాంటి చట్టాలు తేనున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ సిటీలో ఇంటికో కోడి పెంచుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. అక్రమంగా పందేలు వేయడం ఎక్కువవడంతో దాంతో పాటు బెట్టింగులు, వివిధ రకాల నేరాలు కూడా పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు బ్రిటన్‌ లోనూ తాజాగా కోళ్ల పందేల ముఠాను పట్టుకున్నారు. కోళ్ల పందేలు నిర్వహించే బరి(రింగ్)పై పోలీసులు దాడి చేసి బ్రిటిష్-పాకిస్థాన్ ముఠాను పట్టుకున్నారు. మొత్తానికి ఈ కోడిపందేలు ఏపీలోనే కాదు, విదేశాల్లోనూ పెద్ద ఇష్యూగా మారుతున్నాయి. ఇక ఏపీ విషయానికొస్తే సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల పల్లెలు సిద్ధమైపోతున్నాయి.