Begin typing your search above and press return to search.

దళితబంధుకు ఓట్ల రాల్లేదు.. షాకిచ్చిన సాలపల్లి ఓటర్లు

By:  Tupaki Desk   |   2 Nov 2021 11:17 AM IST
దళితబంధుకు ఓట్ల రాల్లేదు.. షాకిచ్చిన సాలపల్లి ఓటర్లు
X
నోట్లకు ఓట్లు రాలతాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే.. కొంత మేర మాత్రమే అన్నది నిజం. తాజాగా ఈ విషయాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం చెబుతోంది.ఈ ఉప ఎన్నికను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో తెలిసిందే కదా. ఈ ఉప ఎన్నిక కోసం గతంలో మరే ముఖ్యమంత్రి చేయని రీతిలో ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురావటమే కాదు.. అందుకోసం లక్షలాది రూపాయిల్ని ఇచ్చేందుకు సైతం వెనుకాడలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. కేసీఆర్ అండ్ కో మాత్రం సమర్థించుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా వెల్లడవుతున్న ఫలితం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు అనుకూలంగా ఉంటే.. టీఆర్ఎస్ కారు జోరుకు బ్రేకులు వేసేలా ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వచ్చిన మెజార్టీ మినహా.. ఇప్పటివరకు వెల్లడించిన రౌండ్ల ఫలితాలు గులాబీ పార్టీకి మింగుడుపడని రీతిలో ఉన్నాయి. కారణం ఏమంటే.. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం కారణంగా ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయం స్పష్టమైంది.

ఎందుకంటే.. దళితబంధు పథకాన్ని తొలుత అమలు చేసిన సాలపల్లిలో వచ్చిన ఓట్లను చూస్తే.. అక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కంటే కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఎక్కువ రావటం చూస్తే.. ఓట్లు రాలుస్తాయని భావించిన దళితబంధు ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయం తేలినట్లేనని చెబుతున్నారు. సాలపల్లిలో గ్యారెంటీగా గులాబీ పార్టీకి మెజార్టీ ఉంటుందని భావిస్తే.. అందుకు భిన్నంగా అక్కడ కూడా ఈటలకు అధిక్యత లభించటం చూస్తే.. దళితబంధు పథకం కేసీఆర్ కు షాకిచ్చిందనే మాట వినిపిస్తోంది.