Begin typing your search above and press return to search.

ఒక్క ఓటు కూడా పోలేదు - భయపడకండి - ద్వివేది

By:  Tupaki Desk   |   7 March 2019 2:35 PM GMT
ఒక్క ఓటు కూడా పోలేదు - భయపడకండి - ద్వివేది
X
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న డేటా వార్‌ నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్‌ గోపాలకృష్ణ ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 11 తర్వాత ఒక్క ఓటు కూడా ఎన్నికల కమిషన్‌ తొలగించలేదని చెప్పారు. ఫామ్‌ 7 అనేది కేవలం దరఖాస్తు మాత్రమేనని.. అది మాకు వచ్చిన తర్వాత మేం పరిశీలించి.. నిజమా కాదా అని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఓట్లు తొలగిస్తామని చెప్పారు. ఫామ్‌ 7 మాకు చేరినంత మాత్రాన ఓటు తొలగించునట్లు కాదని అన్నారు.

ఓట్ల తొలగింపు వ్యవహారంలో పార్టీలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు ద్వివేది. ఓట్లు గల్లంతు అయినట్లు పార్టీలు ఆరోపిస్తున్నాయని.. ఓట్లు ఎక్కడ గల్లంతు అయ్యాయో చూపించాలని సవాల్‌ కోరారు. అన్నింటికి మించి ఫామ్‌ 7 దరఖాస్తులు ఇవ్వడం తప్పుకాదని గుర్తుచేశారు. ఇప్పటివరకు కేవలం 10 వేల ఓట్లను మాత్రమే తొలగించాలని.. ఫామ్‌ 7 ద్వారా కేవలం 40 వేల ఓట్లను మాత్రమే తొలగించే అవకాశం ఉందని గుర్తుచేశారు. అన్నింటికి మించి ఈ ఫామ్ 7లు వస్తున్నాయని ఫిర్యాదులు అందగానే మేం విచారణ చేపట్టామని.. అప్పటినుంచి దరఖాస్తులు రావడం ఆగిపోయాయని గుర్తు చేశారు.

చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా ఏపీలో 8 లక్షల మంది టీడీపీ ఓట్లను తొలగించారనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు ద్వివేది. కేవలం అది ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆయన చెప్తున్నట్లుగా 8 లక్షల ఓట్లు గల్లంతు అయితే.. విచారణకు కేంద్ర ఎన్నికల సంఘం వస్తుందని చెప్పారు. అయినా కూడా అన్ని లక్షల ఓట్లను తొలగించడం అసాధ్యం అని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువుగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే.. నోటిఫికేషన్‌ వచ్చిన దగ్గరనుంచి.. డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు గోపాల కృష్ణ ద్వివేది.