Begin typing your search above and press return to search.

ముగ్గురు కలిసినా ఉపయోగం లేకపోయిందా ?

By:  Tupaki Desk   |   17 Nov 2021 6:36 AM GMT
ముగ్గురు కలిసినా ఉపయోగం లేకపోయిందా ?
X
రాష్ట్రంలో తాజాగా వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా మూడింటిపైనే జనాలందరు దృష్టిపెట్టారు. అవి ఏమిటంటే కుప్పం, నెల్లూరు కార్పొరేషన్ అయితే మూడోది ఆకివీడు మున్సిపాలిటి. కుప్పం మునిసిపాలిటి అంటే చంద్రబాబునాయుడు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నట్లుగా పోరు జరిగింది. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక నెల్లూరు అయితే పెద్ద కార్పొరేషన్ కాబట్టి ఆసక్తిగా తయారైంది.

మొదటి రెండు అంటే ఓకే కానీ ఆకివీడు మున్సిపాలిటికి ఎందుకింత ఇంపార్టెన్సు వచ్చింది ? ఎందుకంటే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా మూడుపార్టీలు కలిశాయి కాబట్టే. ఆకివీడు మున్సిపాలిటిలోని 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఎం మూడుపార్టీలు చేతులు కలిపాయి. టీడీపీ 15 వార్డుల్లో పోటీచేయగా, జనసేన 5 వార్డుల్లో పోటీచేసింది. ఒక వార్డులో సీపీఎం పోటీచేసింది.

అయితే ఇంకా అంతమ ఫలితం రాలేదు కానీ తాజా వార్తల ప్రకారం వైసీపీ 12 వార్డుల్లో గెలిచింది. మిగిలిన వార్డుల్లో కూడా మెజారిటిలోనే ఉంది. అంటే ఆకివీడు మున్సిపాలిటినీ వైసీపీ గెలుచుకున్నదనే విషయం స్పష్టమైపోయింది. మామూలుగా అయితే స్ధానికసంస్ధల ఎన్నికలు అధికారపార్టీకి అనుకూలంగా ఉంటాయని కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయిపోయింది. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై జనాలంతా వ్యతిరేకంగా ఉన్నారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఒకటే ఊదరగొడుతున్నారు.

చంద్రబాబుకు మద్దతుగా నిలిచే ప్రధాన మీడియా మొత్తం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు, వార్తలను వండివారుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇపుడు ఎన్నికలు జరగటంతో జనాల తీర్పు ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ఆకివీడులో మూడు పార్టీలు చేతులు కలపటంతో ఇక్కడ వైసీపీ విజయం సందేహమే అనే ప్రచారం బాగా జరిగింది. తీరా ఫలితాలు చూస్తే ప్రచారం ఉత్త ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. 20 వార్డుల్లో 12 గెలుచుకోవటం, మిగిలిన వాటిల్లో మెజారిటిలో ఉందంటే మామూలు విషయం కాదు. అంటే మూడుపార్టీలు చేతులు కలిపినా వైసీపీని ఓడించలేకపోయాయి.