Begin typing your search above and press return to search.

నిరాశలో తెలంగాణ హోంమంత్రి

By:  Tupaki Desk   |   19 Nov 2018 10:59 AM GMT
నిరాశలో తెలంగాణ హోంమంత్రి
X
నాయిని నర్సింహారెడ్డి.. తెలంగాణ ఏర్పడ్డాక తొలి హోంమంత్రిగా పేరు పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేతల్లో ఈయన ముఖ్యుడు. పార్టీ పుట్టినప్పటి నుంచి కష్టసుఖాల్లో కేసీఆర్ వెంట నడిచాడు. గతంలో టీఆర్ ఎస్ తరఫున ముషీరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ పెద్దాయనకు ఏకంగా తొలి మంత్రివర్గంలోనే తనతోపాటు మంత్రిని చేసి ఏకంగా ప్రతిష్టాత్మక హోంమంత్రి పదవిని కట్టబెట్టారు. అనంతరం ఎమ్మెల్సీ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయించారు.

నాలుగున్నరేళ్లు గడిచాయి. టీఆర్ ఎస్ ఒక దఫా అధికారాన్ని చెలాయించింది. ఇప్పుడు మహాకూటమి తో ప్రతిపక్షాలన్నీ జట్టు కట్టాయి. జీవన్మరణ సమస్యగా మారిన గెలుపు అవకాశాలను ఎక్కడ నిర్లక్ష్యం చేయరాదని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. అందుకే నాయిని కోరికను తాజాగా కేసీఆర్ పక్కనపెట్టారు. నాయిని నర్సింహారెడ్డి ఈసారి కూడా ముషీరాబాద్ సీటును తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఇప్పించాలని కేసీఆర్ వద్ద పెద్ద లాబీ చేశారు. ఏకంగా కేసీఆర్ నే ఒకనొక సందర్భంలో టికెట్ ఇవ్వడం లేదని విమర్శించాడు. కానీ కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. తాజాగా సోమవారం టీఆర్ఎస్ ప్రకటించిన చివరి రెండు సీట్లలో ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్ కు టికెట్ కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాయినికి మొండి చేయి చూపారు. ముఠా గోపాల్ కు ముషీరాబాద్ లో ప్రజాబలంతో పాటు కార్యకర్తల విశేష బలం ఉంది. ప్రజల్లో మంచి ఓటు బ్యాంకు ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడనే ప్రచారం ఉండడంతో కేసీఆర్ నాయిని ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకుండా ముఠా గోపాల్ కే టికెట్ కేటాయించడం విశేషం. ఈ విషయంలో నాయినిని బుజ్జగించి కేసీఆర్ ఒప్పించారు.

ముషీరాబాద్,, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సిట్టింగ్ స్థానం. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకుండా నామినేషన్ చివరి రోజు వరకూ నాన్చింది. చివరకు బలమైన ముఠా గోపాల్ కు కేటాయించింది. టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి నాయినిని కేసీఆర్ కుడిభుజంగా భావిస్తూ ప్రాధాన్యతనిచ్చారు. కానీ బలం, గెలుపు అవకాశాలున్న వారికే టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కేసీఆర్ నాయినిని సైతం ఈసారి పక్కన పెట్టడం విశేషం. అంతేకాదు.. నాయినిని బుజ్జగించి ఏకంగా ఆయన చేతే ముషీరాబాద్ బీఫాంను ముఠా గోపాల్ కు సోమవారం ఇప్పించడం గమనార్హం..

ఇక సోమవారం టీఆర్ ఎస్ ప్రకటించిన రెండో సీటు కోదాడ. పీసీసీ చీఫ్ ఉత్తమ్ భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటును టీడీపీ ముఖ్యనేత బొల్లం మల్లయ్య యాదవ్ ఆశించారు. ఆయనకు టికెట్ దక్కకపోవడంతో శుక్రవారం టీఆర్ఎస్ లో చేరారు. కోదాడలో బలమైన నేతగా ఉన్న మల్లయ్య యాదవ్ ఇప్పుడు అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో కోదాడలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఫైట్ రంజుగా మారింది. సమఉజ్జీల పోరులో గెలుపు ఎవరిది అనేది ఆసక్తిగా మారింది.