Begin typing your search above and press return to search.

కేంద్రంలో మూడో కూటమి అటక మీదికే!

By:  Tupaki Desk   |   27 July 2017 10:49 AM IST
కేంద్రంలో మూడో కూటమి అటక మీదికే!
X
పృష్ట తాడనాత్ దంత భంగ: అని సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది. వీపు మీద తంతే మూతి పళ్లు రాలాయని దాని అర్థం. అంటే ఎక్కడో ఒక చర్య జరిగితే.. దాని ప్రభావం మరెక్కడో ఉంటుందనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల ప్రభావం కూడా అదే రీతిగా ఉంది. నితీశ్ రాజీనామా దెబ్బకు.. కేంద్రంలో మూడో కూటమిగా అవతరించదలచుకుంటున్న ప్రత్యామ్నాయ శక్తుల ఏకీకరణకు పెద్ద దెబ్బగా మారుతోంది. ఆ రకంగా ప్రధాని నరేంద్రమోదీకి చాలా పెద్ద ఎడ్వాంటేజీ ఏర్పడుతోంది.

కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ అంటే కిట్టని, అలాగని కాంగ్రెస్ అంటే కూడా ఇష్టంలేని పార్టీలు దేశంలో చాలానే ఉన్నాయి. ఈ పార్టీలు అన్నీ కలిసి ఒకే రాజకీయ శక్తిగా కేంద్రస్థాయిలో ప్రభావం చూపగలిగే రేంజికి ఏర్పడాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది. నిజానికి 2014 ఎన్నికలకుముందే ఇలాంటి ప్రయత్నం జరిగినా కార్యరూపం దాల్చలేదు. కేవలం ఎన్డీయే – యూపీఏ కూటముల మధ్య పోటీగానే ఆ ఎన్నికలు జరిగాయి.

అయితే ఆ తర్వాత నెమ్మదిగా మూడో కూటమి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నలభయ్యేళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మరకలు లేని రాజకీయ వేత్త బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చే ఎన్నికలకు కూటమిని సిద్ధం చేయాలని ఇటీవలి కాలంనుంచే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ప్రధానంగా నితీశ్ తదితరులతో పాటూ వామపక్షాలు, మరికొందరు కలిసి ఈ ఆలోచన చేశారు. ఇప్పుడు నితీశ్ ప్రభుత్వం రద్దయింది. భారతీయ జనతా పార్టీ బయటినుంచి ఇచ్చే మద్దతుతో నితీశ్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మోదీ దయ లేదా ప్రోత్సాహం వలన జరుగుతున్న ఇలాంటి ఏర్పాటుతో మళ్లీ సీఎం కాగలుగుతున్న నితీశ్ కుమార్.. మోడీకి వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయం కాదలచుకుంటున్న కూటమికి నేతృత్వం వహిస్తారనుకోవడం భ్రమ.