Begin typing your search above and press return to search.

'శాశ్వత భూ హక్కు-భూ రక్ష ' ... రాష్ట్రంలో భూ వివాదాలకు స్వస్తి చెప్పనున్న సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   9 Dec 2020 11:49 AM IST
శాశ్వత భూ హక్కు-భూ రక్ష  ... రాష్ట్రంలో భూ వివాదాలకు స్వస్తి చెప్పనున్న సీఎం జగన్ !
X
ఏపీలో భూముల సమగ్ర సర్వేకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్‌ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభంకానుంది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై ఆయన సమీక్షించారు. ఈ నెల 21 నుంచి భూముల సమగ్ర సర్వే ప్రారంభమవుతుందని చెప్పారు. ఓ గ్రామంలో భూముల సర్వే పూర్తై, మ్యాప్‌లు సిద్ధం కాగానే.. ఆ గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో మార్పులు చేయాలని.. భూవివాదాల పరిష్కారానికి సంచార ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

మొత్తం మూడు విడతల్లో భూములు 17 వేల 460 గ్రామాల్లో సర్వే చేయనుంది. శాశ్వత భూ హక్కు, భూరక్షణ పథకం లో భాగంగా తొలి విడతలో 5 వేలు, రెండో విడతో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే ఉంటుంది. సర్వేలో భాగస్వాములవుతున్న సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వాలని.. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డుల్లో మార్పులు తర్వాత అవకతవకలకు పాల్పడలేని విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సెక్యూరిటీ ఫీచర్స్‌ పటిష్టంగా ఉండాలని.. ఆ మేరకు సర్వే వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు.

సర్వే నిర్వహించాక ల్యాండ్ టైటిలింగ్ కార్డ్ ఇస్తారు. కార్డ్ లో యూనిక్ ఐడెంటీఫికేషన్ నెంబర్, భూ కొలతలు, యజమాని పేరు, ఫొటో ఉంటుంది. వీటితోపాటు ఒక క్యూఆర్ కోడ్ ను కూడా జత చేస్తారు. ఈ భూ కొలతలు పూర్తయ్యాక సర్వే రాళ్లు పాతుతారు. గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్ రిజిస్టర్, వివాదాల నమోదుకు రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి మండలానికి సర్వే కోసం ఒక డ్రోన్ బృందం, డేటా ప్రాసెసింగ్ టీమ్, రీ సర్వే టీమ్ ఉంటాయి. ఇప్పటికే 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలుత ‘కార్స్‌’ టెక్నాలజీ ఆధారంగా రోవర్స్‌ ద్వారా రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో.. తొలుత డ్రోన్ల ద్వారా రీసర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. రోవర్స్‌ వచ్చిన తర్వాత ఎంపికచేసిన ప్రదేశాల్లో కార్స్‌ టెక్నాలజీతో సర్వే చేయనున్నారు. భూ సర్వే పై ప్రజల్లో అనేక రకాల అనుమానాలు రావడం సహజం. తమ భూమి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయోనని వారు ఆందోళన చెందొచ్చు. అందుకే ప్రజల్లో అనుమానాలను తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని.. సీఎం అధికారులను ఆదేశించారు.