Begin typing your search above and press return to search.

తెలంగాణ ‘యాస’ ఏమైంది కేసీఆర్

By:  Tupaki Desk   |   7 Aug 2016 11:06 AM GMT
తెలంగాణ  ‘యాస’ ఏమైంది కేసీఆర్
X
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల తర్వాత తొలిసారి తెలంగాకు వచ్చిన మోడీ పర్యటనలో విశేషాలకు కొదవ లేదని చెప్పాలి. ఉద్యమాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో ప్రధాని హోదాలో కాలు మోపిన మోడీకి ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారీ ఏర్పాట్లను చేసిన వైనం స్పష్టంగా కనిపించింది. ప్రధాని కార్యక్రమానికి సంబంధించి ఏ దశలోనూ ఎలాంటి లోటు లేకుండా భారీగా ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమంలో అందరిని ఆశ్చర్యపరిచిన అంశం ఒకటి ఉందని చెప్పాలి.

కోమటి బండలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించిన వారి మాటల్లో ఎక్కడా తెలంగాణ యాస అన్నది కనిపించకపోవటం గమనార్హం. అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యిందే యాస మీదనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. నీళ్లు.. నిధులు.. నియమకాల విషయంలో జరుగుతున్న అన్యాయం మీదన గళం విప్పినప్పటికీ.. యాస మీద.. సంస్కృతి మీద దాడి జరుగుతున్న విషయం తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా వినిపించేది.

తెలంగాణ ప్రజల్ని భావోద్వేగంతో దగ్గర చేసిన ‘యాస’ను ప్రధాని మోడీ పర్యటనలో కనిపించకపోవటం విశేషమని చెప్పాలి. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో తెలంగాణ యాస అన్నది లేకుండానే యాంకర్లుగా వ్యవహరించిన వారు మాట్లాడటం ఒక లోటుగా చెప్పాలి. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ సంస్కృతి ప్రకారమే ఏర్పాట్లు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. యాస విషయంలో ఎందుకు పట్టించుకోలేదన్నది ఆసక్తికరంగా మారింది. అనుకోకుండా జరిగిందో.. మరే కారణం వల్ల జరిగిందో తెలీదు కానీ.. యాంకర్ల మాటల్లో ఎక్కడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలంగాణ యాస వినిపించకపోవటం మాత్రం పెద్ద లోటుగానే చెప్పాలి.