Begin typing your search above and press return to search.

న‌చ్చ‌కున్నా.. నోరెత్తే ధైర్యం ఎవ‌రికి లేదంతే!

By:  Tupaki Desk   |   15 Jan 2019 5:34 AM GMT
న‌చ్చ‌కున్నా.. నోరెత్తే ధైర్యం ఎవ‌రికి లేదంతే!
X
పోటా పోటీ అన్న ప్ర‌చారంతో సాగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో గులాబీ నేత‌ల ఘ‌న విజ‌యం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అనారోగ్యాల్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ గెలుపు కోసం ప‌రుగులు తీసిన టీఆర్ ఎస్ నేత‌లు మొత్త‌మ్మీదా గెలిచారు. వ‌రించిన విజ‌య‌ల‌క్ష్మీ ఇంటికి వ‌చ్చి నెల పూర్తి అయ్యింది. ఎన్నిక‌ల అధికారి ఎమ్మెల్యే అయ్యారంటూ ఇచ్చిన కాగితం త‌ప్పించి.. అధికారికంగా ప్ర‌మాణ‌స్వీకారం కూడా లేని దుస్థితి.

గ‌డిచిన నెల రోజుల్లో అధినేత కేసీఆర్ తీరుతో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేత‌ల‌కు అస‌లేం అర్థం కాని ప‌రిస్థితి. గెలిచామ‌న్న సంతోషం మిన‌హా వారి ముఖాల్లో మ‌రింకేం క‌నిపించట్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తోపులు.. తురుంఖాన్ లుగా చెప్పుకునే సీనియ‌ర్లు.. మంత్రి వ‌ర్గంలో పెద్ద పెద్ద పోర్టు ఫోలియాలు ఆశిస్తున్న వారి నోట మాట రాని పరిస్థితి. ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకారం చేసినంత‌నే ఆ వ‌రుస‌లోనే ప‌లువురు మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టం రోటీన్ గా సాగే వ్య‌వ‌హారం.

అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఆయ‌న్ను కేసీఆర్ అని ఎవ‌రంటారు చెప్పండి. అందుకేనేమో.. తాను సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టానికి లేని పీడ దినాల్ని.. మంత్రుల‌కు.. ఎమ్మెల్యేల‌కు చెప్పేసిన ఆయ‌న కామ్ గా ఉండిపోయారు. మంత్రి ప‌ద‌వి వ‌స్తుందా? కేబినెట్ లో అస‌లు స్థానం ఉంటుందా? ఇస్తే ఏ మంత్రిత్వ శాఖ‌ను క‌ట్ట‌బెడ‌తార‌న్న ఆలోచ‌న‌ల‌తో ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కేసీఆర్ పార్టీలో జ‌బ్బులున్న నేత‌లకు కొద‌వ‌లేదు. మీద ప‌డిన వ‌య‌సున్న వారు కూడా త‌క్కువేం కాదు. అలాంటి వారికుండే స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోన‌ట్లుగా ఉన్న ముఖ్య‌మంత్రి తీరుతో.. ప‌లువురు నేత‌ల్లో బీపీ అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. నిరాశ‌.. నిస్పృహ‌లు క‌మ్మేసి వారిలో షుగ‌ర్ లెవ‌ల్స్ అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయ‌ట‌. మొత్తం ఎపిసోడ్ లో ఉప‌శ‌మ‌నం ఏమిటంటే.. త‌మ‌కు మాత్ర‌మే కాదు.. ఎవ‌రికి ఎలాంటి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌లేద‌న్న వైనం వారిని ఊపిరి పీల్చుకునేలా చేస్తుంద‌ని చెబుతున్నారు.

ఎమ్మెల్యేగా అనిపించుకోని ప‌లువురు మాజీ మంత్రుల బాధ అంతా ఇంతా కాదట‌. సీనియ‌ర్లుగా.. త‌మ‌కు మించిన మొన‌గాళ్లు ఎవ‌రూ ఉండ‌ర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే నేత‌లు లోలోప‌ల తెగ ఫీలైపోతున్నార‌ట‌. ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత కూడా మంత్రులు కాక‌పోవ‌టం ఏమిట‌న్న దుగ్ద వారిని తెగ ఇబ్బందికి గురి చేస్తుంద‌ట‌. అలా అని మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెడితే.. ఆ సంగ‌తులు కేసీఆర్ చెవిన ప‌డితే త‌మ పొలిటిక‌ల్ కెరీర్ కు ఎక్క‌డ ఇబ్బంది అవుతుంద‌న్న ఉద్దేశంతో కామ్ గా ఉంటున్నార‌ట‌. అత్యంత స‌న్నిహితుల వ‌ద్ద మాత్రం ఒక‌టి అరగా త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్న వైనం క‌నిపిస్తోంది. ఎమ్మెల్యేలుగా గెలిచాం.. కెరీర్ లో ఎప్పుడూ లేని రీతిలో ఎమ్మెల్యేల‌న్న మాట‌ను అనిపించుకుంటున్నామంటూ మాజీ మంత్రులైన కొంద‌రి ఆవేద‌న వింటే అయ్యో అనిపించ‌క మాన‌దు.