Begin typing your search above and press return to search.

నో సీరియస్ నెస్ : మోడీ దగ్గరా అంతేనా...?

By:  Tupaki Desk   |   18 Jun 2022 11:30 PM GMT
నో సీరియస్ నెస్ : మోడీ దగ్గరా అంతేనా...?
X
అన్నీ తలపండిన రాజకీయ పార్టీలే. ఎవరికీ ఏమీ పాఠాలు కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. అదే టైమ్ లో రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర కూడా ఉన్న వారున్నారు. మరి ఇంతమంది ఉండి కూడా రాష్ట్రపతి ఎన్నికల విషయంలో లైట్ తీసుకుంటున్నారా. ఎవరిలోనూ సీరియస్ నెస్ కనిపించడంలేదా. జవాబు మాత్రం అదే వస్తోంది. ఈసారి రాష్ట్రపతికి చాలా ప్రత్యేకత ఉంది. రాజకీయ ప్రాధాన్యత ఉంది.

రాష్ట్రపతి ఎవరు అయినా 2024 ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని నియమిస్తారు. అంటే మెజారిటీ రాని పరిస్థితుల్లో కీలకం అవుతారు. ఒక విధంగా విపక్ష రాజకీయాన్ని మలుపు తిప్పే చాన్స్ ఈ ఎన్నికతోనే వస్తుంది అన్న మాట. మరి అంతటి మహత్తర అవకాశం వస్తే దాన్ని ఎందుకు కాకుండా చేసుకుంటున్నారు అన్నదే చర్చ. అదే టైమ్ లో చూస్తే రాష్ట్రపతి అభ్యర్ధి గెలుపునకు కావాల్సిన అతి స్వల్ప మెజారిటీకి బీజేపీ దగ్గరగా ఉంది తప్ప పూర్తి ఆధిపత్యంతో లేదు.

అంటే ఢీ అంటే ఢీ కొట్టే పరిస్థితి ఉంది అన్న మాట.అలాంటి పరిస్థితులలో అంతా కలసి నడుం బిగిస్తే కాషాయం గుండెల్లో కలవరం రేగాలి. కానీ జరిగింది వేరుగా ఉంది.అంతా ఆషామాషీ వ్యవహారంగా ఉంది.బయట గర్జించిన వారు తీరా మీటింగు పెడితే రారు. మీటింగుకు వచ్చిన వారు మొక్కుబడిగా మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు.

ఈ నెల 15న మమతా బెనర్జీ విపక్షాలను అందరినీ పిలిచి మీటింగ్ పెడితే ఆ సమావేశం చాలా చప్పగా సాగింది. కనీసంగా కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇపుడు శరద్ పవార్ 21న మీటింగ్ అంటున్నారు. దానికి ఎంతమంది వస్తారో తెలియదు. దీని మీద శివసేన అయితే మండుతోంది. ఇదేమి పద్ధతి అంటూ మొత్తానికి మొత్తం విపక్షాల మీద గుస్సా అవుతోంది.

ఇపుడే ఇలా ఉంటే రేపటి ఎన్నికల్లో మోడీ మీద సమర్ధవంతమైన ప్రధాని అభ్యర్ధిని ఎలా నిలబెట్టగలమని కూడా నిలదీస్తోంది. ఆరు నెలల ముందు నుంచి ప్రిపరేషన్ ఉండాలి కదా అని కూడా క్లాస్ పీకుతోంది. పవార్ మీదనే నమ్మకం పెట్టుకుని ఆయన కాదంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో విపక్షం ఉండడం కంటే దారుణం వేరొకటి లేదని కూడా శివసేన తన అధికార పత్రిక సామ్నాలో మొత్తం జాతీయ స్థాయి విపక్షాలకు చాకిరేవే పెట్టేసింది.

ఒక విధంగా చూస్తే ఇది పాయింటే కదా అనిపిస్తుంది.ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనే ఇలా ఉదాశీనంగా ఉండి కాడె వదిలేస్తే రేపటి రోజున మోడీ షాల వ్యూహాలను ఎలా ధీటుగా ఎదుర్కోగలరు అంటే జవాబు ఉందా. ఏది ఏమైనా విపక్షాలు తమ బలహీనతను బీజేపీకి చెప్పకనే చెబుతున్నాయి.అదే టైమ్ లో జనాల్లో తాము దేన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని సంకేతాలు ఇస్తున్నాయి. ఇదే ఇపుడు శివసేనకు కూడా ఆగ్రహం కలిగిస్తోందిట.

పరిస్థితి ఇపుడు ఎంత వరకూ వచ్చింది అంటే బీజేపీ కూడా పెద్దగా సీరియస్ గా ఆలోచనలు చేయకుండా ఎటూ తమ మనిషే గెలుస్తాడు కాబట్టి షార్ట్ లిస్ట్ ఒకటి రెడీ చేసుకుంటే సరిపోతుంది అని ఆలోచిస్తోంది అంటే ఎన్నికల కంటే ముందే గెలిచేసినట్లే కదా.