Begin typing your search above and press return to search.

బూస్టర్‌ డోసు అవసరం అనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు !

By:  Tupaki Desk   |   23 Nov 2021 5:30 PM GMT
బూస్టర్‌ డోసు అవసరం అనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు !
X
కరోనా వైరస్ మహమ్మారి రెండు డోసులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి బూస్టర్‌ డోసు కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్న వాదన ఇటీవల గట్టిగా వినిపిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి నియంత్రణకు బూస్టర్‌ డోసు అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) డాక్టర్‌ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. దేశంలో అర్హులైన వారందరికీ కరోనా టీకా రెండో డోసు పంపిణీని పూర్తి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

దీనితో భారత్‌ లోనూ మూడో డోసు పంపిణీ చేపట్టాలనే వాదనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ వైద్య పరిశోధన , మండలి (ఐసీఎంఆర్‌) కీలక ప్రకటన చేసింది. కరోనా కట్టడి లో బూస్టర్‌ షాట్‌ అవసరం అనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. మూడో డోసు వేసేందుకు శాస్త్రీయ పరమైన ఆధారాలు లేవని దేశంలోని చాలా మంది శాస్త్రవేత్తలు తెలిపినట్లు ఆయన గుర్తుచేశారు. రెండు డోసులు ఇవ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా చెప్తున్నారు. బూస్టర్‌ డోసు అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ఇటీవలే స్పందించారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా రెండు డోసులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అది నెరవేరాక బూస్టర్‌ డోసుపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

బూస్టర్‌ డోసు ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్, నిపుణుల బృందం సూచిస్తే కచ్చితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అధికార వర్గాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. భారత్‌ లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 82 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. 43 శాతం రెండో డోసు కూడా తీసుకున్నారు. గడువు ముగిసినప్పటికీ 12 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఇంకా రెండో డోసు తీసుకోలేదు. కోవిడ్‌ రెండు డోసుల వ్యాక్సిన్స్‌ తీసుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు మన శరీరంలో వృద్ధి చెందుతాయి. ఇవి వైరస్‌ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. వ్యాక్సిన్స్‌ రెండుడోసులు తీసుకొని ఐదారునెలలు గడిచాక వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. వ్యాక్సిన్‌ ప్రభావశీలత క్రమేపీ తగ్గుతుంది. అప్పుడేం చేయాలి, అదనంగా మరో డోసు, మూడో డోసు తీసుకోవాలి. 60 ఏళ్ల పైబడిన వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, స్టెరాయిడ్ల వాడటం మూలంగా రోగనిరోధక తగ్గినవారిని అధిక రిస్కు కలిగిన వారిగా భావించి, పలుదేశాలు మొదట వీరికి బూస్టర్‌ డోసులను సిఫారసు చేశాయి.

నవంబరు నెలారంభం నాటికే ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు బూస్టర్‌ డోసులను మొదలుపెట్టేశాయి లేదా ఆరంభించే క్రమంలో ఉన్నాయి. ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ బూస్టర్‌ డోసులిస్తున్నాయి. ఇజ్రాయెల్, యూకే, ద.కొరియా, టర్కీ, బ్రెజిల్‌ ఈ జాబితాలో ఉన్నాయి. స్వీడన్, స్పెయిన్‌ వయోధికులకు మొదలుపెట్టాయి. అమెరికా, కెనడా ఒకట్రెండు రోజుల్లో ఆరంభించనున్నాయి. అందుబాటులో ఉన్న లెక్కలకు బట్టి చూస్తే ఒక్క నవంబరు 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన డోస్‌లలో 12 శాతం బూస్టర్‌ డోస్‌లేనట. ప్రతి 100 మంది జనాభాలో అత్యధికులకు బూస్టర్‌ డోసులు ఇచ్చిన దేశాల జాబితాలో ఇజ్రాయెల్, చిలీ, ఉరుగ్వే ముందున్నాయి. మనదేశంలో ఇప్పటిదాకా 115 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. రెండు డోసులు తీసుకున్న వారు 38.11 కోట్లు ఉండగా, 37. 45 కోట్ల మంది ఒక్కడోసు తీసుకున్నారు.