Begin typing your search above and press return to search.

ఏపీ.. తెలంగాణకు భిన్నంగా ఆ రాష్ట్రం.. దసరా వరకు నో స్కూల్

By:  Tupaki Desk   |   27 Aug 2020 11:15 AM IST
ఏపీ.. తెలంగాణకు భిన్నంగా ఆ రాష్ట్రం.. దసరా వరకు నో స్కూల్
X
కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు చూడని ఎన్నో సిత్రమైన సన్నివేశాలు వరుస పెట్టి సాగుతున్నాయి. లాక్ డౌన్ తో మొదలైన వైరస్ కట్టడి ప్రయత్నం కొంతమేర మాత్రమే ఫలించిందని చెప్పాలి. అన్ లాక్ మొదలైన వేళ.. కేసుల నమోదు తక్కువగా ఉండటం తెలిసిందే. అన్ లాక్ మొదలైన నాటి నుంచి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజులు గడుస్తున్నా కొత్త కేసులు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. రానున్న మరికొన్ని నెలలు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉందంటున్నారు.

కేసుల సంఖ్య ఒక కొలిక్కి రాకముందే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు.. కాలేజీలు తెరిచే అంశాన్ని ఒకరు తర్వాత ఒకరు ప్రకటనలు చేస్తున్నారు. కేసుల తీవ్రత తగ్గని వేళ.. ఇలా స్కూళ్లు.. కాలేజీలు తెరిచే నిర్ణయం తీసుకుంటే.. పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారతాయన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఏపీకి పొరుగున ఉండే ఒడిశా రాష్ట్రం.. స్కూళ్లు.. కాలేజీలు తెరిచే విషయంలో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. దసరా వరకు ఏ స్కూళ్లు.. కాలేజీలు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు.. కాలేజీలు తెరిచే విషయంలో తెలుగు రాష్ట్రాలు ఒకలా ఆలోచిస్తుంటే.. ఒడిశా మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించటం గమనార్హం.

మార్చి 17 నుంచి కాలేజీలు.. స్కూళ్లు మూసేసిన నేపథ్యంలో.. హడావుడిగా తెరవటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. స్కూళ్లు..కాలేజీల్ని తెరిచే విషయంలో ప్రభుత్వాలు మరింతగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. మరి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారో చూడాలి.