Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు ఇద్దరికి షాకిచ్చిన కేంద్రం

By:  Tupaki Desk   |   28 July 2016 10:51 AM IST
చంద్రుళ్లు ఇద్దరికి షాకిచ్చిన కేంద్రం
X
ఇద్దరు చంద్రుళ్లకు షాక్ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కోటి ఆశలు పెట్టుకున్న అసెంబ్లీ స్థానాల పెంపురానున్న పదేళ్ల వ్యవధిలో లేనట్లేనని తేలిపోయింది. ఈ విషయంపై తాజాగా కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. విభజన చట్టం కంటే రాజ్యాంగమే సుప్రీం అని తేల్చిన కేంద్రం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచే ఆలోచన తమ దగ్గర ఏమీ లేదని తేల్చారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన దేవేందర్ గౌడ్..రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ సుదీర్ఘకమైన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విబజన చట్టంలో పేర్కొన్న అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్ని చూసుకొని.. ఆ ధైర్యంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేశారు.

తాజాగా సీట్ల పెంపు వచ్చే పదేళ్లలో ఏమీ లేదంటూ కేంద్రం తేల్చిన నేపథ్యంలో.. తాజా పరిణామం ఇద్దరు ముఖ్యమంత్రులకు శరాఘాతమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే..

దేవేందర్ గౌడ్ అడిగిందేమిటి?

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ.. తెలంగాణాల్లో సీట్ల పెంపుపై న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరారా? అటార్నీ జనరల్ ఇచ్చిన న్యాయ సలహా ఏమిటి? ఇరు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని ఎన్నికల సంఘం చెబుతున్న వైఖరిని హోంశాఖ ఎలా చూస్తోంది? అంటూ ప్రశ్నలు సంధించారు.

కేంద్ర సహాయమంత్రి ఇచ్చిన సమాధానం ఏమిటి?

= రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ను సవరించకుండా విభజన చట్టంలోని సెక్షన్ 26 ను సవరించి సెక్షన్ 26(1) అమలు చేయొచ్చా? ఒకవేళ సెక్షన్ 26ను సవరించాల్సి వస్తే.. అప్పుడు సెక్షన్ 26లో ఒకరకంగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 మరోలా ఉంటే.. రెండూ విరుద్ధంగా ఉన్నపక్షంలో ఏది చెల్లుబాటు అవుతుంది? ఒకవేళ సెక్షన్ 26లో ఉన్న ఆర్టికల్ 170లో పొందుపర్చిన నిబంధనకు లోబడి అన్న పదానికి బదులుగా.. సెక్షన్ 170కు సంబందం లేకుండా అన్న వ్యాక్యం చేరిస్తే సరిపోతుందా? అని న్యాయశాఖను అడిగాం.

= ఆటార్నీ జనరల్ ఇచ్చిన సలహా ఏమమంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ను సవరించకుండా విభజన చట్టంలోని సెక్షన్ 26ను సవరించి సెక్షన్ 26(1)ను అమలు చేయలేం.

= ఒకవేళ సెక్షన్ 26ను సవరించాల్సి వస్తే.. అప్పుడు సెక్షన్ 26లో ఒకరకంగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 మరోలా ఉంటే.. రెండు వేర్వేరుగా ఉండే అప్పుడు ఏది చెల్లుబాటుఅవుతుందంటే..పార్లమెంటు ఏ చట్ట సవరణ చేసినా రాజ్యాంగంలోని నిబంధనలే చెల్లుబాటు అవుతాయి. రాజ్యాంగ నిబంధనలతే పైచేయి.

= ఒకవేళ ఆర్టికల్ 170కు లోబడి అనే పదానికి బదులుగా ఆర్టికల్ 170కు సంబంధం లేకుండా అన్న వ్యాక్యం చేరిస్తే సరిపోతుందా? అంటే అలా కుదరదని అటార్నీ జనరల్ చెప్పాలి.

= ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఎలాంటి ప్రతిపాదన మా పరిశీలనలో లేదు.