Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలకు కరోనా ముప్పు

By:  Tupaki Desk   |   15 March 2020 7:11 AM GMT
ఎమ్మెల్యేలకు కరోనా ముప్పు
X
కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. అయితే... అసెంబ్లీ వద్ద మాత్రం అలాంటి చర్యలేమీ కనిపించడం లేదు. థర్మల్ స్క్రీనింగ్ కానీ - వైద్యులను అందుబాటులో ఉంచడం వంటిది కానీ అక్కడ లేదు. అలాగే, అందరినీ తనిఖీ చేసే పోలీసులకు వైరస్ సోకకుండా కూడా జాగ్రత్తలేమీ తీసుకోవడం లేదు.

ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు 150 మందికి పైగానే హాజరవుతారు. వారి వెంట వ్యక్తిగత కార్యదర్శులు - గన్‌ మెన్ - డ్రైవర్ - అనుచరులు తదితరులంతా వస్తారు. ఇక మంత్రుల వెంట ఆయా శాఖల కార్యదర్శులు - ఉన్నతాధికారులు - వారి సిబ్బంది - డ్రైవర్లు… ఇలా మరికొంత మంది అసెంబ్లీకి వస్తారు. ఇక అసెంబ్లీ సిబ్బంది - సచివాలయ సిబ్బంది కూడా వందల సంఖ్యలోనే సమావేశాలు ముగిసేదాకా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి. వీరికి తోడు మీడియా సంస్థల సిబ్బందీ పెద్దసంఖ్యలో ఉంటారు. భద్రత కోసం పోలీసులు, మార్షల్స్, ట్రాఫిక్ పోలీసులు… సరేసరి. ప్రతీరోజూ వందల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 1500 నుంచి 2000 మంది ఉండే అసెంబ్లీ ఆవరణలో కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

ముఖ్యంగా థర్మల్ స్క్రీనింగ్ సౌకర్యం లేదు. డాక్టర్లు లేరు. వైద్య సిబ్బంది లేరు. అంబులెన్స్‌ లు లేవు. మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసే పోలీసు సిబ్బందికి చేతులకు గ్లవుజులు లేవు. మాస్క్‌ లు అసలే లేవు. అసెంబ్లీకి వస్తున్నవారిలో జలుబు - దగ్గు లేదా కరోనా లక్షణాలున్నాయేమో తనిఖీ చేసే యంత్రాంగమూ లేదు. అసెంబ్లీ ఆవరణలోని వాష్ రూములలో హాండ్ వాష్ - శానిటైజర్లు వంటివి లేవు.

మారణాయుధాలు తీసుకెళ్ళకుండా మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేస్తున్న పోలీసులకు గ్లవుజులు - మాస్కులు లాంటి స్వీయ రక్షణ ఉపకరణాలు కరువయ్యాయి. ఇతర దేశాల నాయకులను కలుస్తున్న మన నాయకులకూ రక్షణ ఉండడం లేదు. ఇటీవల కెనడాకు చెందిన పోలార్ జెనెటిక్స్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్ వాల్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌ తో భేటీ అయిన తర్వాత అసెంబ్లీకి వచ్చి చాలా మందిని కలిసి ఆ ప్రాంతంలో కలియదిరిగారు. కెనడాలో ప్రధాని భార్యకు సైతం కరోనావచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ వద్ద కూడా కరోనా వ్యాప్తి కాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.