Begin typing your search above and press return to search.

ఢిల్లీ పాలకులు ఎవరెక్కడున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   14 Sept 2016 4:00 AM IST
ఢిల్లీ పాలకులు ఎవరెక్కడున్నారో తెలుసా?
X
దేశ రాజధాని ఢిల్లీలో గన్యా - డెంగీ - మలేరియా వ్యాధులు వ‌ణికిస్తున్న వేళ పాలకులు - నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఢిల్లీపై పట్టుకోసం అక్కడి ఆప్ ప్రభుత్వం - కేంద్రం ఆడుతున్న ఆటలో అమాయక ఢిల్లీ ప్రజలు బలవుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు పాలకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా మారుతున్నాయి. ఢిల్లీలో వ్యాధులు ముసురుకోవడంపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని మోడీపై నిందలు వేశారు. ఢిల్లీలో ఆరోగ్యం వ్యవహారం కేంద్రమే చూసుకుంటోందని.. మోడీనే అడగాలని ఆయన ట్వీట్ చేశారు. అయితే.. కేంద్రాన్ని అడగాలన్న కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా అంటే... ఉంది. ఆరోగ్య మంత్రి కూడా ఉన్నారు. కానీ... ప్రస్తుత వ్యాధుల సమయంలో ఆయన గోవాలో పర్యటిస్తున్నారు. అవును ఢిల్లీ హెల్తు మినిష్టర్ గోవా పర్యటనలో ఉన్నారు. రానున్న గోవా ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనేందుకు అవసరమైన సన్నాహకాల్లో ఆయన ఉన్నారు. ఆయనే కాదు... ఢిల్లీలో ఆరోగ్య వ్యవహారాలు చూడాల్సినవారెవరూ కూడా అందుబాటులో లేకపోవడం విచిత్రం.

ఢిల్లీలో ఇప్పటివరకు చికన్ గున్యాతో నలుగురు - డెంగీ.. మలేరియాలతో మరో పది మంది మరణించారు. ఆస్పత్రులన్నీ పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి.ఢిల్లీలో వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో ఎవరు ఎక్కడున్నారో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

- ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గొంతు సర్జరీ కోసం బెంగళూరుకి వెళ్లారు.

- లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఢిల్లీలో లేరు. అమెరికా వెళ్లారు.

- ముఖ్యమంత్రి నగరంలో లేనప్పుడు ఆ బాధ్యతలు చూడాల్సిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా లేరు. ఆయన ఫిన్లాండ్ వెళ్లారు.

- ఢిల్లీలో ఉన్న ఏకైక మంత్రి కపిల్ మిశ్రాను దీని గురించి అడిగితే.. అది కార్పొరేషన్ బాధ్యత అని - మేయర్ కూడా నగరంలో లేరని చావు కబురు చల్లగా చెబుతున్నారు.

మొత్తానికి సీఎం - ఆరోగ్య మంత్రి - ఉప ముఖ్యమంత్రి - లెఫ్లినెంటు గవర్నరు - మేయరు సహా మొత్తం కట్టకట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రజల పరిస్థితి ఏం కావాలి.?