Begin typing your search above and press return to search.

తెలంగాణ స‌చివాల‌యానికి కొత్త భ‌వ‌నాలు లేన‌ట్లే?

By:  Tupaki Desk   |   24 Nov 2016 7:30 PM GMT
తెలంగాణ స‌చివాల‌యానికి కొత్త భ‌వ‌నాలు లేన‌ట్లే?
X
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కోసం కొత్త భవనాల ప్రతిపాదనలకు గ్ర‌హ‌ణం త‌ప్పేలా లేదు. హైకోర్టులో కేసు నడుస్తుండటం - తాజాగా 500 రూపాయల నోట్లు - 1000 రూపాయల నోట్ల రద్దుతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గడంతో కొత్త భ‌వ‌నాల‌కు నిధుల కొర‌త ఏర్ప‌డింది. నవంబర్ రెండోవారానికే సచివాలయంలోని అన్ని శాఖలను హైదరాబాద్‌లోని వివిధ భవనాల్లోకి తాత్కాలికంగా మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, షిఫ్టింగ్ ప్రక్రియ అమల్లోకి రాలేదు. ప్రస్తుత భవనాలను కూల్చవద్దని - సచివాలయంలోని వివిధ శాఖల విభాగాలను షిఫ్ట్ చేసేందుకు తమకు అభ్యంతరం లేదని హైకోర్టు ఈ నెల ప్రారంభంలో ఒక పిల్ విచారణకు స్వీకరిస్తూ స్పష్టం చేసింది.

ప్రభుత్వం గత నెలలో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చి ఉంటే ఇప్పటికే తెలంగాణ సచివాలయ భవనాల షిఫ్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. బూర్గుల రామకృష్ణారావు భవనం - అరణ్యభవన్ - వ్యవసాయ భవన్ - మైత్రీవనం తదితర భవనాల్లోకి సచివాలయంలోని వివిధ శాఖలను మార్చాలని అక్టోబర్‌ లో నిర్ణయించారు. అయితే... తాజా ప‌రిణామ‌ల‌తో అన్నిటికీ బ్రేక్ ప‌డుతోంది.

మ‌రోవైపు ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చడం అంశంపై కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు కనిపిస్తోంది. హైకోర్టుకు ఇచ్చిన సమాధానం ప్రకారం ఇప్పటికిప్పుడే భవనాలను కూల్చబోమని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు భవనాలను కూలగొట్టి కొత్తగా, అత్యంత అధునాతన సౌకర్యాలతో ఒకే భవనాన్ని పది అంతస్తులతో నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చాలా రోజుల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుత సచివాలయ భవనాలు వాస్తుప్రకారం లేకపోవడం వల్ల కొత్త భవనాన్ని పది అంతస్తులతో దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం 350 కోట్ల రూపాయలను కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ... ఇప్పుడు నోట్ల ర‌ద్దుతో సీను మారింది. ధ‌నిక రాష్ట్రంగా చెప్పుకొనే తెలంగాణ‌కూ నిధుల కొర‌త మొద‌లైంది.

హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వాజ్యం బుధ‌వార‌మే విచారణకు రావలసి ఉన్నా రాలేదు. ప్రభుత్వం కూడా ఈ అంశంలో ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. దీంతో కొత్త భ‌వ‌నాలు ఇప్ప‌ట్లో లేన‌ట్లేన‌ని అంటున్నారు. కొత్త స‌చివాల‌యానికి బ్రేకులు ప‌డినా కేసీఆర్ అధికార నివాసం మాత్రం అవిఘ్నంగా పూర్తయి ఈ రోజు ఓపెనింగ్ కూడా అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/