Begin typing your search above and press return to search.

కొత్త ఐడియా: నో హెల్మెట్.. నో పెట్రోల్

By:  Tupaki Desk   |   29 March 2016 4:33 AM GMT
కొత్త ఐడియా: నో హెల్మెట్.. నో పెట్రోల్
X
రోడ్డు ప్రమాదాల్ని నివారించే ప్రయత్నంలో భాగంగా ఈ అంశంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ అంశంలో తెలంగాణ సర్కారు కాస్త కఠినంగానే వ్యవహరిస్తూ.. హెల్మెట్ వినియోగించని వారికి జైలుశిక్ష విధించాలన్న ఆలోచన కూడా చేసింది. అధికారికంగా నిర్ణయం తసుకున్నా.. ఇప్పటివరకూ ఈ నేరంపై జైలుశిక్ష మాత్రం వేయలేదు.

అయితే.. తెలంగాణ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు విమర్శనాస్త్రాల్నిసంధిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఛత్తీస్ గడ్ కు చెందిన బిలాస్ పూర్ కలెక్టర్ అన్బళగన్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపే వారికి చెక్ పెడుతూ.. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ కు పెట్రోల్ కోసం వచ్చే వాహనదారులకు పెట్రోల్ పోయకుండా నిర్ణయం తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదాల మీద చైతన్యం పెంచుతూ.. హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరిస్తూనే.. పెట్రోల్ బంక్ కు వచ్చే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు తగ్గ ఆదేశాల్ని ఇచ్చారు. ఒకవేళ హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోసినట్లుగా తేలితే.. సదరు పెట్రోల్ బంక్ పై చర్యలు తీసుకుంటామని అన్బళగన్ స్పష్టం చేస్తున్నారు. హెల్మెట్ లేని వారికి నో పెట్రోల్ అన్న రూల్ అదిరిపోయిందని.. జైలు అనే మాట కంటే ఇదే పవర్ ఫుల్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఇలాంటి ఆలోచనను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే బాగుంటుందేమో..?