Begin typing your search above and press return to search.

టీవీ డిబేట్ల కు టీఆర్ఎస్ నుంచి నో పర్సన్

By:  Tupaki Desk   |   11 Dec 2019 5:31 AM GMT
టీవీ డిబేట్ల కు టీఆర్ఎస్ నుంచి నో పర్సన్
X
తెల్లవారినంతనే న్యూస్ ఛానళ్ల లో పొలిటికల్ డిబేట్లతో షురూ చేయటం తెలిసిందే. అన్ని పార్టీలకు చెందిన నేతల్ని పిలవటం మొదట్నించి వస్తున్నదే. గతంలో ఇలాంటి డిబేట్లకు పేరున్న నేతలు కూడా వచ్చేవారు. రోజులు గడిచే కొద్దీ ఛానళ్ల సంఖ్య పెరిగి.. విషయం తగ్గిపోతున్న పరిస్థితి. అనవసరమైన వివాదాల కు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.


ఉద్యమ పార్టీగా ప్రయాణం మొదలై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికార పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ తరఫున పలువురు నేతలు టీవీల్లో నిర్వహించే డిబేట్ల కు వెళ్లేవారు. ఉద్యమ సమయం లో ఈ డిబేట్ల కోసం కొంతమందిని తయారు చేసే వారు. ఏ పార్టీని ఏ రీతిలో ఎదుర్కొవాలి.. వారి పై ఎలాంటి ప్రశ్నలు సంధించాలి? లాంటి అంశాల పై ప్రత్యేక కసరత్తు చేసేవారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చాక అధికారపక్షంగా అవతరించిన టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు.. నిర్ణయాల్ని వివరించేందుకు వంద మందితో కూడిన ఒక టీంను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ.. ఆచరణలో అది సాధ్యం కాలేదు. దీనికి సంబంధించిన కొంత కసరత్తు జరిగినప్పటికీ వాస్తవ రూపం దాల్చలేదని చెబుతారు. ఇదిలా ఉంటే.. టీవీ డిబేట్లలో పాల్గొనటం ద్వారా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోవటం.. పార్టీ పనుల కంటే పార్టీ కి తలనొప్పులు తెచ్చే పనులు చేసే వారు ఎక్కువ కావటం తో టీఆర్ఎస్ అధినాయకత్వం ఈ అంశం పై ఆలోచన లో పడినట్లు గా తెలుస్తోంది.


టీవీ చర్చల్లో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు.. కామెంట్లు పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టటంతో పాటు.. విమర్శలకు అవకాశం ఇస్తోంది. దీంతో.. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక పై.. పార్టీ నుంచి ఎవరూ టీవీ డిబేట్ల కు వెళ్లకూడదన్న ఆదేశాన్ని జారీ చేసినట్లు చెబుతున్నారు.


ఇప్పుడున్న పరిస్థితు ల్లో పార్టీ తరఫున మాట్లాడాల్సిన అవసరం లేదని.. డిబేట్లలో మాట్లాడే వారి మాటలన్నిపార్టీ అభిప్రాయాలుగా చెలామణీ కావటం.. సోషల్ మీడియా లో అనవసరమైన విమర్శలకు అవకాశం ఇస్తుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధినాయకత్వం తీసుకున్న తాజా నిర్ణయం తో డిబేట్ల మీద బతికేసే పలువురికి ఇబ్బంది కరంగా మారిందంటున్నారు.