Begin typing your search above and press return to search.

టీనేజ‌ర్ల‌కు క‌రోనా వ్యాక్సిన్ వ‌ద్దు..యూకే నిపుణులు

By:  Tupaki Desk   |   5 Sept 2021 1:00 PM IST
టీనేజ‌ర్ల‌కు క‌రోనా వ్యాక్సిన్ వ‌ద్దు..యూకే నిపుణులు
X
ఒక‌వైపు వ‌యోజ‌నుల‌కు క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది. మ‌రోవైపు చిన్నారులు, టీనేజ‌ర్ల‌పై ఈ టీకా ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే టీనేజ‌ర్ల‌కు క‌రోనా టీకాలు అందుబాటులోకి వస్తాయ‌ని వివిధ సంస్థ‌లు చెబుతున్నాయి. కొన్ని దేశాల్లో కొన్ని టీకాలు అందుబాటులోకి వ‌చ్చేశాయి కూడా. అయితే.. యూకే నిపుణుల క‌మిటీ మాత్రం, టీనేజ‌ర్ల‌కు వ్యాక్సినేష‌న్ విష‌యంలో తొంద‌ర‌పాటు వ‌ద్దంటూ సూచ‌న‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. త‌మ దేశంలో 12 నుంచి 17 యేళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ల‌ను స‌జెస్ట్ చేయ‌డం లేదు నిపుణుల క‌మిటీ. ఈ విష‌యంలో ఆచితూచి స్పందించాల‌ని అంటోంది.

అయితే ఆ వ‌య‌సు పిల్ల‌ల్లో ఎవ‌రైనా దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో ఇబ్బంది పెడుతూ ఉంటే వారికి మాత్రం ప్ర‌యోగాల్లో విజ‌య‌వంత‌మైన వ్యాక్సిన్ల‌ను ఇవ్వాల‌ని వారు చెబుతున్నారు. క్యాన్స‌ర్లు, డ‌యాబెటిస్ వంటి వ్యాధిగ్ర‌స్తులైన టీనేజ‌ర్ల‌కు మాత్ర‌మే వ్యాక్సిన్ ఇవ్వాల‌ని, ఆరోగ్య‌వంతులైన టీనేజ‌ర్ల‌కు క‌రోనా వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌ని నిపుణుల క‌మిటీ స‌జెస్ట్ చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో టీనేజ‌ర్ల‌కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ‌యోజ‌నుల‌తో పాటు, టీనేజ‌ర్ల‌కు కూడా అక్క‌డ వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ వారికి కూడా ఆరోగ్య ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే యూకే నిపుణులు మాత్రం ఈ అంశంలో ఆలోచించుకోవాలంటున్నారు. వ్యాక్సిన్ ను క‌చ్చితంగా వేయ‌వ‌చ్చ‌ని వారు స‌జెస్ట్ చేయ‌డం లేదు.

ఇది వ‌ర‌కూ కూడా కొంద‌రు ప‌రిశోధ‌కులు ఈ విష‌యంలో అభ్యంత‌రం చెప్పారు. వ్యాధినిరోధ‌క‌త మంచి స్థాయిలో ఉండి, కోవిడ్ ను ఎదుర్కొన‌గ‌ల శ‌క్తి ఉన్న యువ‌త‌కు వ్యాక్సిన్ ఎందుకు? అని వారు ప్ర‌శ్నించారు. టీనేజ‌ర్ల‌కే కాదు, ఒక‌సారి కోవిడ్ కు గురై కోలుకున్న వారికి కూడా వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా.. కొంద‌రు ప‌రిశోధ‌కులు స్పందించారు. ఇప్పుడు టీనేజ‌ర్ల‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌న్న వాద‌న‌ను యూకే నిపుణులు తెర మీద‌కు తీసుకు వ‌చ్చారు. మ‌రి ఈ అంశంలో భార‌తీయ వైద్య సంస్థ‌లు, నిపుణులు ఏమంటారో!