Begin typing your search above and press return to search.

అవినీతి నిరోధక చట్ట సవరణ.. ఎవరికి లాభం , ఎవరికి నష్టం

By:  Tupaki Desk   |   7 Sept 2021 11:52 AM IST
అవినీతి నిరోధక చట్ట సవరణ.. ఎవరికి లాభం , ఎవరికి నష్టం
X
చట్టంలో ప్రస్తుతం తెచ్చిన ఒక సవరణ వల్ల ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో వున్నా వారి మీద కొన్ని రకాల అవినీతి కేసులు నమోదు చేయాలంటే ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి. అన్ని కేటగిరీల్లోని అధికారులకు ఇది వర్తిస్తుంది కాబట్టి, అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఊపిరి పీల్చుకొనే అవకాశం ఏర్పడింది. నిజానికి అవినీతి అధికారులపై కేసులను కోర్టుల్లో ప్రాసిక్యూట్‌ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీనికి తోడు కేసులు పెట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అవటంతో నియంత్రణ సంస్థల చేతులు కట్టి పడేసినట్లయింది. అంతే గాదు రిటైర్‌ అయిన ఉద్యోగులను అవినీతి కేసుల్లో ప్రాసిక్యూట్‌ చేయాలన్నా ప్రభుత్వ అనుమతి అవసరమనే అంశం ఈ కొత్త సవరణలల్లో చోటు చేసుకోవటం అందర్నీ ఆలోచనలో పడేస్తోంది.

తాజాగా ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు , పబ్లిక్‌ సర్వెంట్లపై అవినీతి కేసులు పెట్టే విధానాన్ని నియంత్రిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎవరు పడితే వారు కేసులు పెట్టడానికి లేదు. డీజీ స్థాయి అధికారికి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వానికి లేదా సంబంధిత పబ్లిక్‌ సర్వెంట్‌ను తొలగించే అధికారం ఉన్న వ్యక్తికి ఈ ఫిర్యాదును ఇవ్వాలని అందులో కేంద్రం తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం డీజీ స్థాయి అధికారి మాత్రమే కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్లు, ఎండీలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు చేయడానికి అనుమతి తీసుకోవాలి.

డీజీ స్థాయి అధికారి ఫిర్యాదుకు సాక్ష్యాలు ఉన్నాయో లేవో చూస్తారు. నిర్ధారణ చేసుకోవాలి. ఆ వివరాలను దర్యాప్తు అనుమతి కోసం పెట్టిన దరఖాస్తులో స్పష్టంగా చెప్పాలి. చివరిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 1988లో రాజీవ్‌ గాంధీ హయాంలో అవినీతి నిరోధక చట్టం తీసుకు వచ్చారు. వీటిని సడలిస్తూ మోడీ ప్రభుత్వం 2018లో కొత్త చట్టం తెచ్చింది. దానికి సంబంధించిన అమలు మార్గ దర్శకాలను సోమవారం నోటిఫై చేశారు. పబ్లిక్ సర్వెంట్‌ కేటగిరి కిందకు వచ్చే వారందరిపై కేసులు పెట్టే విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పద్దతి తెచ్చేందుకు కేంద్రం ఇలా చేసినట్లుగా చెప్తారు. ఈ చట్టం ప్రకారం ఇక అధికారంలో ఉన్న పార్టీలకు సన్నిహితంగా ఉండేవారిపై కేసులు పెట్టడం అసాధ్యం. కాబట్టి వారి ఏకైక లక్ష్యం ప్రతి పక్ష పార్టీలే అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.