Begin typing your search above and press return to search.

ఎడ్జ్ ఉన్నా.. సాకే స్పందించ‌రే.. ఎందుకిలా?

By:  Tupaki Desk   |   14 March 2021 9:00 AM IST
ఎడ్జ్ ఉన్నా.. సాకే స్పందించ‌రే.. ఎందుకిలా?
X
ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఏపీలో ఎదిగేందుకు కాంగ్రెస్‌కు ఎంతో ఎడ్జ్ ఉంద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో రాష్టం లో అడ్ర‌స్ కోల్పోయిన కాంగ్రెస్‌... 2014, 2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైంది. ద‌రిమిలా.. పార్టీ అధ్య‌క్షుడిని మార్చారు. దీంతో నీల‌కంఠాపురం ర‌ఘువీరారెడ్డి స్థానంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సాకే శైల‌జానాథ్‌ను రంగంలోకి దింపారు. దీంతో పార్టీ పుంజుకుంటుంద‌ని.. ముఖ్యంగా పార్టీలోకి మ‌ళ్లీ పాత‌త‌రం నేత‌లు వ‌స్తార‌ని.. అంద‌రినీ క‌లుపుకొని పోయే సాకేకు ప‌రాజ యం ఉండ‌ద‌ని అనుకున్నారు. ముఖ్యంగా గ‌తంలో మంత్రిగా కూడా చేసిన సాకేకు రాష్ట్ర రాజ‌కీయాల్లో అంద‌రూ సుప‌రిచితులే.

అయితే.. ఇప్ప‌టికి సాకే కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టి రెండేళ్లు పూర్త‌యినా.. పార్టీ ప‌రిస్థితి ఇప్ప‌టి వ‌ర‌కు పుంజుకున్న‌ది లేదు. అంతే కాదు.. పాత‌త‌రం నేతలు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ బాట ప‌ట్టింది లేదు. మ‌రోవైపు రాష్ట్ర రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తి, నాయ‌కుడు కూడా లేకుండా పోయారు. ఒక్క అధికార పార్టీని ప‌క్క‌న పెడితే.. టీడీపీ పుంజుకుంటుందా? లేదా? అనేది సందేహంగానేఉంది. చంద్ర‌బాబు త‌ర్వాత పార్టీని న‌డిపించే నాయ‌కుడు ఎవ‌రు? అనేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నారా లోకేష్ నాయ‌క‌త్వానికి సొంత పార్టీ నేత‌ల్లోనే గుస‌గుస‌లు ఉన్నాయి.

ఇక‌, ప్ర‌శ్నిస్తానంటూ.. వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌శ్నించ‌డం మానేసి.. తానే ప్ర‌శ్న‌ల్లో కూరుకుపోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యామ్నాయ పార్టీ కావాల్సిన అవ‌స‌రం ఉంది. ముఖ్యంగా కేంద్రం దూకుడుతో హోదా లేకుండా పోయింది. విశాఖ ఉక్కు అడ‌క‌త్తెర‌లో ఉంది.. అదేవిధంగా రాష్ట్రంలో మ‌త ప‌ర‌మైన వివాదాలు వెలుగు చూస్తున్నాయి. హిందూ ఆల‌యాల‌పై దాడులు .. ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా అంశాల‌ను ప‌రిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి పుంజుకునేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. నాయ‌క‌త్వం మార్చినా.. ఈ దిశ‌గా నాయ‌కులు ఎందుకు ఆలోచ‌న చేయ‌లేక పోతున్నార‌నే వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రి ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా సాకే స‌హా యువ నాయ‌క‌త్వం ముందుకు వ‌చ్చి.. పార్టీని ప‌టిష్టం చేసుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.