Begin typing your search above and press return to search.

నో మాస్క్ .. నో రూల్స్ .. ముందే థర్డ్‌ వేవ్‌ !

By:  Tupaki Desk   |   19 July 2021 11:30 PM GMT
నో మాస్క్ .. నో రూల్స్ .. ముందే థర్డ్‌ వేవ్‌ !
X
కరోనా వైరస్..కరోనా వైరస్..గత ఏడాదిన్నరకి పైగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. చైనా లో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ కరోనా మహమ్మారి, ఆ తర్వాత ఒక్కొక్క దేశానికి విస్తరిస్తూ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతా, ఇంతా కాదు. కరోనా దెబ్బకి దేశంలో ప్రతి ఒక్కరూ కూడా అబ్బా అన్నారు. ఎన్నో కుటుంబాల్లో కరోనా తీరని లోటుని మిగిల్చింది. ఎంతోమంది కరోనా మహమ్మారి భారిన పడి కన్నుమూశారు. ఇదిలా ఉంటే..మొదటి వేవ్ కరోనా కంటే సెకండ్ వేవ్ కరోనా జోరు దేశంలో ఇంకా ఎక్కువగా ఉన్నది. ఈ మధ్యనే సెకండ్ వేవ్ జోరు కొంచెం తగ్గినా కూడా, ఇంకా పూర్తిగా మహమ్మారి ముప్పు తొలగిపోలేదు.

కరోనా వైరస్ విజృంభణ సమయంలో ప్రజల రక్షణ కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్లు ,రాత్రి కర్ఫ్యూలు అమల్లోకి తీసుకువచ్చాయి. కరోనా నియమాలతో సామాన్యులు పని లేక , తినడానికి తిండి లేక అల్లాడిపోతుంటే , కరోనా సెకండ్ వేవ్ కొంచెం అదుపులోకి వచ్చింది కదా అని నియమాలని కొంచెం సడలిస్తే దాన్ని ప్రజలు ఉపయోగించుకోకుండా, పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. మాస్క్‌ లు ధరించాలన్న ముందుజాగ్రత్త పట్టడం లేదు, భౌతిక దూరం పాటించాలన్న నిబంధన పట్టించుకోవడం లేదు , కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నామన్న అతి ధీమాతో కరోనా అంటే భయమే లేదు, మమ్మల్ని ఏంచేయలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజల నుంచి నాయకుల వరకు అందరిది ఇదే తీరు.

దీనితో మళ్లీ కరోనాను చేజేతులా ఆహ్వానిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా జీవనం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తే అసలు మహమ్మారి లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నాటికి థర్డ్‌ వేవ్‌ వస్తుందని వైద్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంటే.. వైద్య నిపుణులు మాత్రం పరిస్థితులు ఇలాగే ఉంటే కొద్ది రోజుల్లోనే థర్డ్‌ వేవ్‌ ఖాయమని హెచ్చరిస్తున్నారు. దీనికి తగ్గట్టే రాష్ట్రంలో రెండు ఆదివారాల నుంచి జరుగుతున్న బోనాల్లో ప్రజలు గుమ్మి గూడుతున్నారు. భక్తుల్లో 80 శాతం మంది మాస్క్‌లు ధరించడం లేదు. వారాంత సంతలు, ఆదివారాలు చేపలు, మాంసం మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు భారీగా వెళ్తున్నారు. కరోనా నియమాలు తుంగలో తోక్కేస్తున్నారు.

ఇప్పుడే ఇలా ఉంటే.. వరుసగా పండుగలు రాబోతున్న నేపథ్యంలో పరిస్థితిని ఊహించుకుంటేనే ఆందోళన కలుగుతోంది. కాగా, రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ నియంత్రణలోకి రాలేదు. అత్యధిక పాజిటివ్‌ రేటు నమోదవుతోన్న జిల్లాల్లో ఖమ్మం కూడా ఉంది. జూలైలో 3,500 కేసులు నమోదయ్యాయి. వైరా మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో రోజుల వ్యవధిలో 17 కేసులు వచ్చాయి. ఫంక్షన్‌లో పాల్గొనేందుకు దీంతో చాలాకాలం తర్వాత రెడ్‌ జోన్‌లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో 11 ప్రాంతాలను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ హాట్‌ స్పాట్‌ లుగా గుర్తించింది. తీసుకోవాల్సిన చర్యలను తెలిపింది.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి లో సంహపక్తి భోజనాలు చేశారు. బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎవరూ భౌతిక దూరం పాటించలేదు. ఎక్కువ శాతం మంది మాస్కులు ధరించలేదు. ఇక చాలామంది మంత్రులు మాస్క్‌లు లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రోజు హైదరాబాద్‌ లో పెద్దఎత్తున సందడి నెలకొంది. కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కొద్ది రోజులుగా హుజూరాబాద్‌ లో ర్యాలీల్లో పాల్గొంటున్నారు. కరీంనగర్‌ జిల్లాల్లో నమోదయ్యే కేసుల్లో 30 శాతం హుజూరాబాద్‌ నుంచే వస్తున్నాయి.

ప్రస్తుతం కేసులు జీరోకి రాలేదు. కాబట్టి పూర్తిగా తగ్గిందన్న నిర్ణయానికి రాకూడదు. ప్రజలు మరో ఏడాది జాగ్రత్తలు పాటించాలి. అజాగ్రత్తగా ఉంటే కొవిడ్‌ విజృంభించే ప్రమాదం ఉంది. మాస్క్‌ లు, శానిటైజర్లు వాడటంతో పాటు ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు కోరుకుంటున్నారు. స్వీయ జాగ్రత్తలు ఒక్కటే అసలైన మంత్రం. లేదంటే ఎవరూ కాపాడలేరు. కొన్ని ప్రాంతాల్లో కేసులు కొద్దిగా ఎక్కువే నమోదవుతున్నాయి.