Begin typing your search above and press return to search.

ముషారఫ్ కు ఆ మాత్రం కూడా తెలియదా?

By:  Tupaki Desk   |   12 Jan 2016 9:56 AM GMT
ముషారఫ్ కు ఆ మాత్రం కూడా తెలియదా?
X
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ కు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి గడ్డి పెట్టారు. భారత్ - పాకిస్థాన్ లు రెండూ ఉగ్రవాద బాధిత దేశాలేనని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పాకిస్థాన్ లో జరిగిన ఉగ్రదాడులలో ఒక్క భారతీయుడైనా, ఎప్పుడైనా దొరికాడా అని ఆయన ప్రశ్నించారు. భారత్ లో జరిగే ఉగ్రదాడులకు మాత్రం పాకిస్థానీలే కారణమవుతున్నారని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ముషారఫ్ కు కూడా ఆ సంగతి తెలుసని ఆయన అన్నారు.

భారత్ లో దాడులు, పాకిస్ధాన్ లో జరిగే ఉగ్రదాడులకు మధ్య మౌలికమైన తేడా ఉందని ఆయన అన్నారు. పాక్ లో జరిగిన ఏ ఉగ్రదాడిలోనూ ఒక్క భారతీయుడు కూడా పట్టుబడలేదనీ, ఆదే ఆ దేశంలో జరిగే దాడులకు భారత్ కు ఎలాంటి సంబంధం లేదనడానికి తార్కాణమని సుబ్రమణ్యం స్వామి అన్నారు. అదే భారత్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడిలోనూ ఐఎస్ఐ, పాక్ మిలిటరీకి నేరుగా సంబంధం ఉందని భారత్ ఆధారాలతో సహా రుజువు చేసిందనీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముషార్రఫ్ అర్ధం చేసుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.

భారత్ ను తీవ్రంగా వ్యతిరేకించే ముషార్రఫ్ వంటివారికి ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ మొన్నటి పఠాన్ కోట్ దాడుల సూత్రధారుల కోసం పాక్ లో గాలింపు చర్యలు చేపట్టడం ఏమాత్రం నచ్చడం లేదు. అయితే అగ్రరాజ్యం అమెరికా జోక్యం చేసుకోవడంతో ఏమీ అనలేని పరిస్థితుల్లో ఇలా తమను, భారత్ ను ఒకే గాటన కడుతూ భారత్ పై నిందలేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని సుబ్రమణ్య స్వామి తిప్పికొట్టారు.