Begin typing your search above and press return to search.

జీతం.. జీవితం.. ఉద్యోగి వెతలు..!

By:  Tupaki Desk   |   13 Oct 2019 1:30 AM GMT
జీతం.. జీవితం.. ఉద్యోగి వెతలు..!
X
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విజయరహస్యం ఏంటో తెలుసా?.. అక్కడ పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఆఫీసులో ఎవ్వరూ చేయరు.. 8 గంటలంటూ పని ఉండదు.. ల్యాన్ లో గడ్డి మీద.. ఆఫీసులో కాఫీ షాపులో ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా చేసుకోవచ్చట.. టార్గెట్లు ఉండవు..ఊహకు రెక్కలొస్తే ఎగిరిపోయేలా పని ఉంటుంది. స్వేచ్ఛ పక్షి విహరించేలా పని వాతావరణం ఉంటుందట.. పైగా ఉద్యోగి కోరుకున్న జీతానికి మించి ఇస్తారు.. లక్షల జీతం.. ఒత్తిడి లేని ఉద్యోగం.. ఓ పండుగలా పని వాతావరణం.. ఒక ఉద్యోగికి ఇంతకంటే ఏం కావాలి.? అందుకే అక్కడ అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి..

ఇక కొన్ని సంస్థలుంటాయి.. చేరేటప్పుడు ప్రతిభను బట్టి పెంచుతామంటాయి.. సంవత్సరం గడుస్తుంది.. జీతం అడిగితే అప్పుడేనా అంటారు.. రెండేళ్లు - మూడేళ్లు.. మధ్యలో ఆర్థిక మాంద్యం గట్రా వచ్చేస్తాయి.. ఐదేళ్లు గడిచినా జీతాల పెంచని సంస్థలు ఎన్నో ఉంటాయి.. లక్షలు లోపలేసుకుంటూ కనీసం ఓ 10శాతం కూడా ఉద్యోగులకు పెంచడానికి ఆయా యాజమాన్యాలకు ధైర్యం రాదు.. అడిగితే ఏవేవో కారణాలు.. బతుకలేక బడిపంతులన్నట్టు ఇప్పుడు మనసు చంపుకొని జీతం కోసం పనిచేసేవాళ్లు ఎందరో ఉంటారు. కానీ జీతం కోసం పనిచేసేవాళ్లకు.. జీతం పెరిగి ఉల్లాసంగా పనిచేసేవారికి చాలా తేడా ఉంటుంది. సంస్థ మనకు భరోసాగా.. ఆర్థికంగా ఉంటుందని తెలిసినప్పుడు దాని కోసం ప్రాణం పెట్టి ఉద్యోగులు పనిచేస్తారు.. అద్భుతాలు ఆవిష్కరిస్తారు.. దాన్ని నంబర్ 1లో నిలబెడుతారు.. కానీ ఇలా జీతాల పేరుతో పీనాసి సంఘాలుగా మారిన యాజమాన్యాల పట్ల ఉద్యోగుల మనసుల్లో వ్యతిరేకత తప్పితే సంస్థ కోసం పనిచేయాలన్న కసి పట్టుదల లోపిస్తుందని చాలా సర్వేల్లో తేలింది.

జీవితం సాఫీగా సాగాలంటే పనిచేయాలి.. పనిచేస్తే జీతం వస్తుంది.. హాయిగా బతకవచ్చు. మరి సంవత్సరాల పాటు పనిచేసినా జీతం పెరగకపోతే.. ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది. పనిచేసే సంస్థపై నిబద్ధత లోపిస్తుంది.. ‘తిన్నామా.. పనిచేశామా.? తెల్లారిందా?’ అన్నట్టు గానుగెద్దులా పనిచేస్తారే కానీ.. సృజనాత్మకతతో మంచి మనసుతో అద్భుతంగా పనిచేయడానికి ఏ ఉద్యోగి ఆసక్తి చూపరు.. దీంతో సంస్థ పనితీరు, మనుగడ కూడా ప్రశ్నార్థకంగా తయారవుతుందని ఫ్రాన్స్ లోని ఇన్ సెర్మ్ పరిశోధనకేంద్రం తమ సర్వేలో తేల్చింది.

ఇక మంచి ఉద్యోగం.. మంచి జీతం ఉన్న వాళ్ల జీవితానికి - ఆరోగ్యానికి ఢోకా ఉండదని ప్రాన్స్ పరిశోధకుల పరిశోధనలో తేలింది. ఎప్పుడైతే జీతం పెరగక తగ్గడం మొదలవుతుందో అప్పుడు వారి మెదడు ఆరోగ్యం దెబ్బతినడం మొదలవుతుందని అధ్యయనంలో తెలిసింది.

ఏళ్లుగా చేస్తున్న వారికి జీతం పెరగకపోయినా.. జీతం తగ్గినా.. కోతపడినా.. వారి మెదడు పనితీరు దెబ్బతింటుందని అధ్యయనంలో తేలింది. అమెరికాలో 2007-2009 వరకు ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయం పడిపోయిన 3287 మంది 23-35 మధ్య వయసున్న ఉద్యోగులపై పరిశోధన చేసి మరీ ఈ నిజాన్ని తేల్చారు. ‘న్యూరాలజీ జర్నల్’లో దీన్ని ప్రచురించారు. ఆదాయం తగ్గిన వాళ్ల ఆలోచన, జ్ఞాపకశక్తికి పరీక్ష పెట్టగా.. సంపాదన తగ్గిపోని వారితో పోల్చితే జీతం తగ్గిన వారు ఈ పరీక్షల్లో తేలిపోయారు.వాళ్లు జీతం పెంచని సంస్థ కోసం తమ 100శాతం పనని ఎప్పుడూ చేయరని తేల్చారు. అంతేకాదు.. జీతం పెరగకపోతే వారికి అధిక రక్తపోటు - మెదడు పనితీరు దెబ్బతినట్టు తేలింది. సో జీతం ఉంటే జీవితం హాయిగా ఉంటుంది. కానీ ఆ జీతం పెరగడం మాత్రం ఉద్యోగి చేతుల్లో లేకపోవడమే విధివైచిత్యం..!