Begin typing your search above and press return to search.

అమెరికా ష‌ట్‌ డౌన్‌..హైద‌రాబాద్‌ లో అంతా ఓకే

By:  Tupaki Desk   |   22 Jan 2018 4:21 AM GMT
అమెరికా ష‌ట్‌ డౌన్‌..హైద‌రాబాద్‌ లో అంతా ఓకే
X
అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ కార్యాలయాల మూసివేత రెండో రోజుకు చేరుకుంది. తాజా ప్రభుత్వ కార్యాలయాల మూసివేతతో ఫెడరల్ కార్యాలయాల సిబ్బంది వేతనాలు లేకుండానే ఇండ్ల వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. 1990 నుంచి ఇప్పటివరకు అమెరికాలో ప్రభుత్వ కార్యాలయాలు నాలుగుసార్లు మూతపడ్డాయి. రిపబ్లికన్ సెనెటర్ మిచ్ మైక్ కన్నేల్ స్పందిస్తూ సోమవారం ఉదయం లోగా ప్రతిష్ఠంభనకు తెర దించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇదే స‌మ‌యంలో అమెరికాలో ప్రభుత్వ కార్యాలయాల మూసివేతపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ప్రతిష్ఠంభన ఇలాగే కొనసాగితే సెనెట్ నిబంధనలను మార్చివేసేందుకు రిపబ్లికన్లు చర్యలు తీసుకుంటారని ఆయ‌న‌ ట్వీట్ చేశారు. ఇమ్మిగ్రేషన్ - అమెరికా డ్రీమర్ల పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని డెమోక్రాట్లు వ్యతిరేకిస్తుండటం వల్లే ఈ ప్రతిష్ఠంభనకు దారి తీసిన సంగ‌తి తెలిసిందే.

ప్రస్తుతం సెనెట్‌ లో అధికార రిపబ్లికన్ పార్టీకి స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది. ఏదైనా కీలక బిల్లు ఆమోదం పొందాలంటే సెనెట్‌లో 60 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయాలని సూపర్ మెజారిటీ నిబంధన ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాధారణ మెజారిటీ 51 ఓట్లతో దీర్ఘకాలిక బడ్జెట్ ఆమోదించేలా సెనెట్ నిబంధనలు మార్చేయాల్సి ఉంటుందని ట్రంప్ త‌న ట్వీట్‌ లో హెచ్చ‌రించారు. దీని ప్రకారం రిపబ్లికన్లకు సుమారు 10 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి సెనెట్ అడ్డు చెప్పడంతో ట్రంప్ డెమోక్రాట్లపై వ్యతిరేక ప్రచారానికి దిగారు. విదేశీయులు అక్రమంగా దేశంలోకి చొరబడినా తనిఖీ చేయొద్దని డెమోక్రాట్లు కోరుతున్నారని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు అధికార రిపబ్లికన్లు - ప్రతిపక్ష డెమోక్రాట్లు పరస్పరం విమర్శలకు దిగారు. డెమోక్రాట్లు స్వల్పకాలిక బడ్జెట్ ఆమోదానికి కూడా సిద్ధంగా లేరని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి తగు చర్యలు తీసుకునేందుకు ఇరు పక్షాలు ప్రయత్నాలు చేపట్టాయి. పరిస్థితి ఇలాగే సాగితే వచ్చే నవంబర్‌ లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా అమెరికా ప్రభుత్వంలో సాంకేతిక సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడినా.. తమ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని హైదరాబాద్‌ లోని అమెరికా కాన్సులేట్ తెలిపింది. వీసా - తదితర సేవల కోసం దరఖాస్తు చేసుకున్నవారు నిర్దేశిత సమయంలో కాన్సులేట్ కార్యాలయానికి హాజరు కావాలని ఒక ప్రకటనలో అధికారులు వివ‌రించారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కూడా కాన్సులర్ సేవలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది.