Begin typing your search above and press return to search.

డిసెంబరులో హాట్ హాట్.. ఏప్రిల్ లో కూల్ కూల్

By:  Tupaki Desk   |   7 April 2019 5:54 AM GMT
డిసెంబరులో హాట్ హాట్.. ఏప్రిల్ లో కూల్ కూల్
X
డిసెంబరులో హాట్.. హాట్ గా ఉండటం ఏమిటి? ఏప్రిల్ లో కూల్ గా ఉండటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అన్న క్వశ్చన్లు అక్కర్లేదు. ఇక్కడ మేం చెప్పబోతున్నది వాతావరణం గురించి కాదు.. ఎన్నికల సీన్ గురించి. గత డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. నాటి చలి పులి సైతం బెదిరిపోయేంతగా ఎన్నికల వేడి తెలంగాణ వ్యాప్తంగా రాజుకుంది.

అందుకు భిన్నంగా మండుటెండల్లో తెలంగాణలో జరుగుతున్న తాజా లోక్ సభ ఎన్నికల్లో వేడి అస్సలు కనిపించటం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్ని వదిలేసి.. ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. అంచనాలకు అందని రీతిలో జరుగుతున్న పోటీతో ఏపీలో ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపై ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏ పార్టీని అభిమానించే వారు.. ఆ పార్టీనే అధికారంలోకి వస్తున్నట్లు చెబుతున్నారే కానీ.. పక్కాగా ఫలితం ఇలా ఉంటుందని ఆత్మవిశ్వాసంతో చెప్పేటోళ్లు కనిపించని పరిస్థితి. పోటీ అంత తీవ్రంగా సాగుతున్న పరిస్థితి.

ఏపీలో తాజాగా జరుగుతున్న ఎన్నికల ఫుణ్యమా అని.. స్నేహితుల మధ్యన రాజకీయ వైరం కొత్త రచ్చగా మారింది. మిత్రులే అయినప్పటికీ.. రాజకీయ అభిరుచుల మధ్యనున్న తేడాలతో.. తాము అభిమానించే పార్టీ గొప్పదంటే.. కాదు.. తాము మద్దతు పలికే పార్టీనే బెస్ట్ అంటూ వాదనలు చేసుకోవటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇందుకు భిన్నమైన పరిస్థితి తెలంగాణలో నెలకొంది. తెలంగాణలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది. కాకుంటే.. తెలంగాణలో టీఆర్ ఎస్ వ్యతిరేకత చాప కింద నీరు మాదిరి పారుతోందన్న మాట కొందరు అదే పనిగా చెబుతున్నారు.

ప్రతిపక్షం అన్నది లేకుండా.. ప్రత్యర్థి పార్టీ ఉనికే లేని రీతిలో తెలంగాణ అధికారపక్షం పావులు కదపటాన్ని పలువురు తెలంగాణ వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారని.. ప్రశ్నించే ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుందన్న మాట జోరు పెరుగుతోంది. అయితే.. తెలంగాణలో అధికారపక్షంపై పోరాడే శక్తి విపక్షాలకు లేవని చెప్ప క తప్పదు. దీంతో.. తెలంగాణలో ఎన్నికల హడావుడి నామమాత్రంగా ుంటే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో నెలకొందని చెప్పక తప్పదు. ఈ కారణంతోనే తెలంగాణలో ఎండలు మండుతున్న ఏప్రిల్ లో రాజకీయంగా మాత్రం కూల్ వాతావరణం నెలకొంది.